19 July, 2026 | 1:53 AM

కప్పు కొట్టేదెవరు?

19-07-2026 12:00 AM
  1. నేడు సాకర్ ప్రపంచకప్ ఫైనల్
  2. టైటిల్ పోరుకు అర్జెంటీనా, స్పెయిన్ రెడీ
  3. మెస్సీ, యమాల్ పైనే అందరి చూపు
  4. సమఉజ్జీల సమరంగా అంచనా

ఒక జట్టు డిఫెండింగ్ చాంపియన్.. మరో జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ.. ఈ రెండు జట్ల మధ్య టైటిల్ ఫైట్ జరగబోతోంది. వరుసగా రెండోసారి టైటిల్‌పై కన్నేసిన అర్జెంటీనాకు ఇప్పుడు తుది పోరులో స్పెయిన్ సవాల్ విసురుతోంది. డిఫెన్స్‌లో తిరుగులేని స్పెయిన్ పైచేయి సాధిస్తుందా దూకుడుగా ఆడే అర్జెంటీనా గెలుస్తుందా... దిగ్గజ ఆటగాడు మెస్సీ వరల్డ్‌కప్ కెరీర్ ఘనంగా ముగుస్తుందా.. లేక మెస్సీ చేతిలో ఆడుకున్న యమాల్ స్పెయిన్‌కు వరల్డ్‌కప్ అందిస్తాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్దిగంటల్లో తెరపడిపోనుంది.

న్యూయార్క్, జూలై 18 : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం అర్థరాత్రి అర్జెంటీనా, స్పెయిన్ మధ్య టైటిల్ సమరం జరగబోతోంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అర్జెంటీనా మరోసారి వరల్డ్‌కప్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే..16 ఏళ్ల తర్వాత రెండోసారి టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని వదులుకోకూడ దని స్పెయిన్ పట్టుదలగా ఉంది. బలాబ లాల పరంగా రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు కనిపిస్తున్నాయి.

దీంతో అసలు సిసలైన సాకర్ యుద్ధం అభిమానులను అలరించడం ఖాయం. ఈ సారి  వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే అర్జెంటీనా దుమ్మురేపింది. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ను, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు.

8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులోనూ దూ సుకెళుతున్నాడు. మరోవైపు స్పెయిన్ కూడా అదరగొడుతోంది. తమపై ఉన్న అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది. సెమీఫైనల్లో బలమైన ఫ్రాన్స్ జట్టును ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ టోర్నీలో స్పెయిన్ కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుని తిరుగులేని డిఫెన్స్‌తో దూసుకుపోతోంది. 

ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ యూరో ఛాంపియన్ స్పెయిన్, డిఫెండింగ్ కోపా అమెరికా ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. కాగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ మూడు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇరు జట్ల బలాబలాలను చూస్తే స్పెయిన్ ప్రధానంగా ’టికీ-టాకా’ వ్యూహంతో ముందుకెళుతుంది. అంటే బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకుంటూ ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేస్తుంది.

స్పెయిన్ ఆటను నిశితంగా పరిశీలిస్తే ఆ జట్టును ఓడించడం అర్జెంటీనాకు కత్తిమీద సామే. ప్రత్యర్థికి బంతే ఇవ్వకుండా మ్యాచ్ వేగాన్ని తమ చేతుల్లో తీసుకోవడం. బంతి తమ దగ్గర ఉంటే ప్రత్యర్థి గోల్ చేయలేడు. ఇదే ఆ వ్యూహం వెనుక ఉన్న అసలు ఆలోచన.వరుసగా 37 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని అజేయమైన రికార్డుతో ఫైనల్ చేరిన ఘనత కూడా ఆ జట్టు సొంతం. 

ఇదిలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్‌గా  బరిలోకి దిగిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మ్యాజిక్ , పటిష్టమైన డిఫెన్స్‌పై ఆధారపడుతుంది. వ్యూహాత్మకంగా వేగంగా కౌంటర్ అటాక్ చేయడంలో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అర్జెంటీనాకు పేరుంది. కానీ స్పెయిన్‌ను నిలువరించడం అర్జెంటీనాకు పెను సవాలే. ఫైనల్లో విజయం సాధించాలంటే అర్జెంటీనా ది బెస్ట్ ఇవ్వాల్సిందే.

మొత్తం మీద స్పెయిన్ డిఫెన్స్‌కు, అర్జెంటీనా దూకుడుకు మధ్య జరగబోయే ఈ సాకర్ సమరం అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చెప్పొచ్చు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు ఇప్పటివరకు 14 సార్లు తలపడగా, రెండు జట్లు చెరో 6 మ్యాచ్‌లలో గెలిచాయి. 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. ప్రపంచకప్ వేదికపై 1966 తర్వాత ఈ రెండు జట్లు మళ్లీ ఇప్పుడే తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హాజరవనున్నారు.

స్పెయిన్ కీలక ఆటగాళ్లు

రోడ్రి : కెప్టెన్, ప్రత్యర్థి కౌంటర్ అటాక్‌ను అడ్డుకోవడంలో దిట్ట

యమాల్ : అద్భుతమైన డిబ్లింగ్, వేగంతో ప్రత్యర్థి ఢిపెన్స్‌ను ఛేదించడంలో దిట్ట

విలియమ్స్ : ప్రత్యర్థి బాక్స్‌లోకి పాసులు అందించడంలో దిట్ట

సైమన్ : అత్యుత్తమ గోల్‌కీపర్‌గా స్పెయిన్‌కు ప్రధాన బలం

****************************************

అర్జెంటీనా కీలక ఆటగాళ్లు

మెస్సీ : కెప్టెన్, అద్భుతమైన పాసింగ్, ఫ్రీ కిక్స్‌తో గోల్ కొట్టే నైపుణ్యం

ఫెర్నాండెజ్ : మిడ్‌ఫీల్డ్ బలాన్ని పెంచే కీలక ఆటగాడు

లాటరో మార్జినెజ్ : ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించే సత్తా ఉన్న ఆటగాడు

ఎమిలియానో : గోల్‌కీపర్‌గా అర్జెంటీనాకు అతిపెద్ద బలం