19 July, 2026 | 1:54 AM

శాంతి, సామరస్యాన్ని కాపాడాలి

19-07-2026 12:00 AM
  1. అది ప్రతి పౌరుడి బాధ్యత
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  3. ప్రజా సమస్యలపై పోరాడాలి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

సికింద్రాబాద్, జూలై 18 (విజయక్రాంతి): దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కుటుంబ నియంతృత్వ పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా అత్యంత కీలకమని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీజేపీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, బూత్ లెవల్ అధికారు లను బెదిరించడం, విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని అన్నారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర  అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలతో మమేకమై సంస్థాగత బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని  కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, బండ కార్తీక రెడ్డి, సారంగపాని, రమేష్, నెమలి ఆనంద్, నందకం దివాకర్, వెంకటేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

  1. రైతుల భూములు లాక్కోవద్దు
  2. బుల్లెట్ ట్రైన్‌కు వ్యతిరేకం కాదు
  3. ప్రత్యామ్నాయం చూపకుండా లాక్కుంటే ఎలా?
  4. పరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గం
  5. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
  6. బహదూర్‌గూడ ఘటనపై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): శంషాబాద్ బహదూర్‌గూడలో మెట్రో, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల పేరుతో స్థానిక రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం, దీనిపై శాంతియుతంగా పోరాడుతున్న బీజేపీ నాయకులను, రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు, మెట్రో లేదా బుల్లెట్ ట్రైన్ రాకకు బీజేపీ గానీ, ఇక్కడి రైతులు గానీ వ్యతిరేకం కాదని, పచ్చని పంటలు పండుతున్న భూములను లాక్కుంటూ, రైతులకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా, న్యాయమైన నష్టపరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెయ్యిమందికి పైగా పోలీసులను మోహరించి, కంచెలు వేసి మరీ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు.

ఉదయం నుంచే రైతుల పక్షాన ధర్నాకు దిగిన బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మహేందర్, సీనియర్ నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ నాయకులను పోలీసులు ఘర్షణ వాతావరణం సృష్టించి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి వీడి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.