19 July, 2026 | 1:29 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాటకాలు

19-07-2026 12:00 AM

నిరుద్యోగుల గొంతు కోస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటిస్తున్న కేటీఆర్, కులగణన పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇరువురూ కలిసి అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

2019లో తీసుకువచ్చిన 124వ రాజ్యాంగ సవరణ (103వ చట్టం) ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద దగా జరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 65 తీసుకువచ్చి, మొత్తం 100 పోస్టులకు నేరుగా 10 శాతం కోటాను వర్తింపజేసి, దొడ్డిదారిన 10 పోస్టులను అగ్రవర్ణాలకు కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల 45% ఉండాల్సిన ఓపెన్ కేటగిరీ 40%కి పడిపోయి, ఓపెన్ కేటగిరీలో మెరిట్ సాధించగల ఎస్సీ, ఎస్టీ, బీసీల అవకాశాలు నేరుగా దొంగిలించబడుతున్నాయని తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే లెక్కల ప్రకారమే, తెలంగాణ రాష్ట్రంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని, రాష్ట్రంలో ఓసీల జనాభా 11.9% కాగా, అందులో ఆర్థికంగా వెనుకబడి ఈడబ్ల్యూఎస్‌కు అర్హత ఉన్నవారు కేవలం 5.36% మాత్రమే అని తెలిపారు. కేవలం 5.36% ఉన్నవారికి 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో 56.33% జనాభా ఉన్న బీసీలకు దక్కుతున్న రిజర్వేషన్లు కేవలం 27% మాత్రమే అని అన్నారు. అలాగే 17% ఉన్న ఎస్సీలకు 15%, 10% ఉన్న ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారని తెలిపారు.

పాలకులు మారినా, పెత్తందారీ కులాలైన రెడ్లు, వెలమలు, కమ్మల పిల్లలకు ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ దోపిడీని ఇరువురూ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈడబ్ల్యూఎస్ కోటాను తక్షణమే రద్దు చేయాలని, ఆ తర్వాతే నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో ఎవరెంత శాతం ఉన్నారో, వారికి ఆ మేరకే రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చి బీసీ ప్రభుత్వం ఏర్పడితేనే ఈడబ్ల్యూఎస్ రద్దవుతుందని అన్నారు.