లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలి
బీసీ అభివృద్ధి, సంక్షేమ సలహాదారు వి. హనుమంతరావు
మహబూబ్నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బీసీ అభివృద్ధి, సంక్షేమ సలహాదారు వి. హనుమంతరావు సూచించారు. ఎదిరలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి, విద్యార్థులతో ముచ్చటించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వసతి, పౌష్టికాహార సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎదిగి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు భవిష్యత్తులో సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి విష్ణు నందన్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






