చెక్కి క్యాంపు సబ్‌స్టేషన్‌కు అదనంగా 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్
బోధన్,(విజయక్రాంతి): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతో పాటు అధిక లోడ్ కారణంగా ఏర్పడే ట్రిప్పింగ్స్, విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు బోధన్‌లోని 33/11 కేవీ చెక్కి క్యాంపు సబ్‌స్టేషన్‌లో అదనంగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్‌లో ఉన్న 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌కు అదనంగా మరో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను TGNPDCL సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి మంజూరు చేయగా, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి మంగళవారం నిజామాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.వి. రాజేశ్వర్‌రావు ప్రారంభించారు.
దీంతో చెక్కి క్యాంపు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు లోడ్ సమస్యలు, ట్రిప్పింగ్స్ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా వినియోగదారులు, సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన బోధన్ టౌన్-2 నూతన సెక్షన్ కార్యాలయ భవనాన్ని సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.వి. రాజేశ్వర్‌రావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మరోవైపు 33/11 కేవీ చెక్కి క్యాంపు సబ్‌స్టేషన్‌ను *రిమోట్ మానిటరింగ్ సబ్‌స్టేషన్ (RMS)*గా ఆధునికీకరించి వరంగల్‌లోని SCADA (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) కేంద్రానికి అనుసంధానం చేశారు.
ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వరంగల్‌లోని SCADA కేంద్రం నుంచి సబ్‌స్టేషన్‌ను రిమోట్‌గా, మానవరహితంగా ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో బోధన్ డివిజనల్ ఇంజనీర్ ముక్తార్ మొహమ్మద్, నిజామాబాద్ టెక్నికల్, MRT & కన్‌స్ట్రక్షన్ డివిజనల్ ఇంజనీర్ డి. వెంకటరమణ, బోధన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కే. నగేష్‌కుమార్, ట్రాన్స్‌ఫార్మర్స్ ఏఈ నటరాజ్, బోధన్ టౌన్-2 ఏఈ కళ్యాణ్, టౌన్-1 ఏఈ కృష్ణ, TRE ఏఈ సాయిలు, సివిల్ ఏఈ కార్తీక్‌తో పాటు బోధన్ టౌన్-2 సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.






