14 August, 2026 | 1:55 AM

ఆర్జీయూకేటీకి ప్రపంచస్థాయి గుర్తింపు

14-08-2026 12:43 AM
  1. ఫోర్బ్స్ పుస్తకంలో స్థానం, వాషింగ్టన్ పోస్ట్‌లో కథనం
  2. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు వైస్ ఛాన్సలర్ గోవర్ధన్

నిర్మల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో నిర్వహించిన విద్యా వారోత్సవానికి అంతర్జాతీయ గౌరవం దక్కినట్టు వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ గురువారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మే 11 నుంచి 17 వరకు నిర్వహించిన విద్యా వారోత్సవంలో భాగంగా విశ్వవిద్యాలయంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక బాధ్యత, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాలు ఫోర్బ్స్ ప్రపంచ రికార్డుల పుస్తకంలో స్థానం సంపాదించగా, ది వాషింగ్టన్ పోస్ట్ లో ప్రత్యేక కథనం ప్రచురితం అయినట్టు వివరించారు. ప్రోగ్రామ్ కోహ్‌ఆర్డినేటర్ డాక్టర్ దేవరాజు పర్యవేక్షణలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంతో తమకు గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కార్యక్రమాలు, యోగా, ఆరోగ్య పరీక్షలు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ అక్షరాస్యత, వర్క్‌షాప్‌లు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రపంచస్థాయి గుర్తింపు విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని వైస్ ఛాన్సలర్ కొనియాడారు.