14 August, 2026 | 2:41 AM

సచివాలయంపై ఏసీబీ కన్ను

14-08-2026 01:34 AM
  1. కీలక శాఖల అధికారుల వివరాలపై ఆరా
  2. భారీగా ఆస్తులు కూడబెట్టినవారే టార్గెట్
  3. సీఎస్ అనుమతితోనే వివరాల సేకరణ!

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్ర మాస్తులపై ఏసీబీ దూకుడు పెరుగుతు న్న నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనా పరమైన కీలక నిర్ణయాలు జరిగే సచివాలయంపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. ఇది అధికార వర్గాల్లో గుబులు రేపుతుంది. కొంతమంది కీలక అధికారుల వివరాలపై ఏసీబీ ఆరా తీస్తున్నదనే సమాచారంతో భారీగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై నిఘా పెంచుతున్నారన్న చర్చతో సచివాలయంలో ఉత్కంఠ నెలకొంది.

ఫైనాన్స్, మున్సిపల్ తదితర కీలక శాఖల్లోని అధికారుల వ్యవహారాలపై సమాచారం సేకరించడంతో పాటు గతంలో ఏసీబీ కేసులు ఎదుర్కొ న్న అధికారులు, భారీ ప్రాజెక్టులు ఆర్థిక నిర్ణయాలతో సంబంధం ఉన్నవారి వివరాలపైనా దృష్టి ఉందన్న ప్రచారం మరింత ఆసక్తి రేపుతోంది.

అయితే సచివాలయంలోని ఉన్నతాధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఇది కేవలం సమాచార సేకరణకే పరిమితమవుతాయా? లేక రానున్న రోజుల్లో సోదా లు, కేసులు సంచలన పరిణామాలకు దారితీస్తాయా? అనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

భారీగా ఆస్తులున్నవారిపైనే..

భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు లేదా అనుమానాలు ఉన్న అధి కారులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించిందనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. సచివాలయంలోని కీలక స్థాయి అధికారుల ఆస్తుల వివరాలపైనా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ముఖ్యంగా ముందుగా రూ. 200 కోట్ల ఆస్తులకు పైగా ఉన్న అధికారులు, తర్వాత రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అధికారులు, అనంతరం రూ. 50 కోట్ల ఆస్తులున్న అధికారుల జాబి తా సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం.

ఆయా అధికారులు గతంలో పనిచేసిన ప్రాంతా లు, వారి ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, భూములు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర పెట్టుబడులపై ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు, టెండర్లు, భూవ్యవహారాలు, అనుమతులు, ఆర్థిక నిర్ణయాలతో సంబంధం ఉన్న కొంతమంది అధికారుల వ్యవహారాలను ఏసీబీ పరిశీలిస్తోందనే చర్చ వినిపిస్తోంది.

సచివాలయంలోని కీలక శాఖల్లో ఫైనాన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు చెందిన కొంతమంది అధికారుల వ్యవహారాలపై ఏసీబీ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. భారీ నిధుల కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, టెండర్లు, కాంట్రాక్టులు, పట్టణాభివృద్ధి, భూవ్యవహారాలు, అనుమతులు వంటి కీలక అంశాలతో ఈ శాఖలకు సంబంధం ఉండటంతో.. నిర్ణయ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా గతంలో వివిధ శాఖల్లో పనిచేసిన సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఆ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అధికారుల ఆస్తుల పెరుగుదల వంటి అంశాలపై ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఫైనాన్స్, మున్సిపల్ శాఖల్లోని కొంతమంది అధికారుల్లోనూ ఏసీబీ కదలికలపై ఆసక్తి నెలకొంది.

భారీగా ఏసీబీ కేసులు..

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు కొనసాగుతోంది. లంచం కేసులతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపైనా ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2025లో ఏసీబీ 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్ట్ చేయగా.. ఇందులో 157 ట్రాప్ కేసులు, 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయి. ఆ ఏడాది నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రూ.96 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2026లో ఏసీబీ మరింత దూకుడు పెంచినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల్లోనే 67 కేసులు నమోదు కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇందులో 34 ట్రాప్ కేసులు, 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. 1983 తర్వాత రెండో త్రైమాసికంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే అత్యధికమని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

అంతేకాదు.. జూలై 10 నాటికే 2026లో 14 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 86 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మొత్తం నమోదైన 15 అక్రమాస్తుల కేసులకు దాదాపు సమానంగా ఆరు నెలల్లోనే కేసులు నమోదవడం ఏసీబీ దూకుడుకు అద్దం పడుతోంది. ఈ కేసు ల్లో పలువురు సీనియర్ అధికారులు, ఇంజినీర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సచివాలయంలోని కీలక శాఖల అధికారులపైనా ఏసీబీ దృష్టి సారించిందనే ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాస్తులపై నిఘా పెంచిన ఏసీబీ.. తదుపరి దశలో సచివాలయ స్థాయిలో ఎలాంటి చర్యలకు దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

సీఎస్ అనుమతితోనే..

ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తం గా ఏసీబీ దాడుల్లో చాలా మంది ఉన్నతాధికారుల నుంచి వందలాది కోట్ల అక్రమ ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. దీంతో ప్రభుత్వ పరిపాలనా ప్రధాన కార్యాలయమైన సచివాలయంలోని ఉన్నతాధి కారులపైనా నిఘా పెంచాలని ఏసీబీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అనుమతితోనే సచివాలయంపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం.

ఇటీవల ఏసీబీ దాడుల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక, పట్టణాభివృద్ధి, ల్యాండ్ అండ్ రికార్డ్స్ వంటి శాఖల అధికారులే ఎక్కువగా చిక్కారు. దీంతో సచివాలయంలోనూ ఆయా శాఖల ఉన్నతాధికారులపై నిఘా పెంచినట్టు తెలుస్తోంది. అయితే సచివాల యంలో ఏసీబీ నిఘా వ్యవహారం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే 2012లో సచివాలయం లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలువురు అధికారులు పట్టుబడటం సంచలనంగా సృష్టించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో 2017, 2019 లోనూ ఏసీబీ రహస్యంగా తనిఖీలు నిర్వహించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి సచివాలయంపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టడంతో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సచివాలయంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారనే ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే గతంలో జరిగిన ఘటనలతో పోలిస్తే.. ఈసారి ఏసీబీ దృష్టి కేవలం లంచాల వ్యవహారాలకే పరిమితమవుతుందా? లేక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానాలున్న అధికారులపై నేరుగా దాడులు నిర్వహిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.