ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): మండలంలోని అడ గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్టర్లు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.అనంతరం పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విద్యార్థుల హాజరు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఆయన గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో సమీక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో పారిశుధ్య లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని ఆదేశించారు.






