14 August, 2026 | 5:05 AM

ప్రభుత్వ భూముల వేలమే మీ పనా?

14-08-2026 01:26 AM
  1. ముఖ్యమంత్రివా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా?
  2. రాయదుర్గ్‌లో హెరిటేజ్ భూములు అమ్మే కుట్రలు
  3. నాడు ఎన్విరాన్మెంట్ భూములు.. నేడు హెరిటేజ్ భూములా?
  4. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ‘రేవంత్‌రెడ్డి నువ్వు ముఖ్య మంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటు వా’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా?.. నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన ‘నువ్వు.. నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలంవేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నవు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ.. నేడు రాయదుర్గ్ ఇలా ఎక్కడికక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటు అని విమర్శించారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నం. 83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో టీజీఐఐసీ వేలం వేయడానికి సిద్ధం కావడం తీవ్రంగా ఖండించారు.

2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి.. నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని, ప్రతిపక్షంలో ఒక మాట.. అధికా రంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా? అని ప్రశ్నించారు. జీవో నెం. 4 ద్వారా సర్వే నం. 83ను హెరిటేజ్ సైట్‌గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని, హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం.. వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోంది? మీ అనుయాయులకు మేలు చేసేందుకేనా? అని నిలదీశారు.

గతంలో ఇదే సర్వే నంబర్‌లోని 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు రూ. 237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్బీఐ కోర్టుకు ఎక్కగా, కోర్టు అంక్షితలు వేసిందని, ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. అయినా అదే సర్వే నంబర్‌లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? న్యాయ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు. భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం.. భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతోందని నిలదీశారు.

రూ. 2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలకు విలువలేదా?, భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న టీజీఐఐసీ వేలాలను వెంటనే నిలిపివేయాలని, అలాగే సర్వే నం.83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకుతీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు.

భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడటం దారుణమని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని హితవు పలికారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు.. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండాలని, లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.