14 August, 2026 | 3:04 AM

బంగారం మింగిన బ్యాంకు!

14-08-2026 01:20 AM
  1. రూ.90 లక్షల గోల్డ్ స్వాహా చేసిన అసిస్టెంట్ మేనేజర్ 
  2.    700 గ్రాములు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు! 
  3. మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకులో ఘటన 
  4. భూక్యా రాజేష్‌పై కేసు నమోదు, దర్యాప్తు

మహబూబాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన సుమారు రూ.90 లక్షల విలువైన 700 గ్రాముల బంగారం గల్లంతైంది. బ్యాంకు అంతర్గత తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. 22 మంది ఖాతాదారులకు చెందిన బంగారాన్ని బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్యా రాజేష్ స్వాహా చేసి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

బ్యాంకులో ప్రతి నెలా అంతర్గత ఆడిట్, తనిఖీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈనెల 11న ఆడిట్, రికార్డుల తనిఖీలు చేపట్టగా బంగారం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చిం ది. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 700 గ్రాముల బంగారాన్ని బ్యాంకు నుంచి అక్రమంగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ  దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

ఖాతాదారులు లబోదిబో..

బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన ఖాతాదారులు పెద్దసంఖ్యలో గురువారం బ్యాంకు వద్దకు తరలివచ్చారు. బ్యాంకులో బంగారం పెడితే భద్రంగా ఉంటుందని భావించామని, బ్యాంకు సిబ్బందే స్వాహా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఖాతాదారులకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.

కాగా అసిస్టెంట్ మేనేజర్ కుటుం బ సభ్యులు కొంత బంగారాన్ని ఇప్పటికే తిరిగి బ్యాంకుకు అప్పగించినట్లు సమాచారం. మరికొంత బంగారాన్ని ప్రైవేట్ సంస్థలో తాకట్టు పెట్టి నట్లు గుర్తించడంతో దాన్ని కూడా రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే బంగారం ఎంత మేరకు రికవరీ అయింది, ఇంకా ఎంత రికవరీ కావాల్సి ఉందనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలాఉంటే, ఇటీవల కురవి మండలకేంద్రంలోని ఓ వాణిజ్య బ్యాంకులో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును ఓ ఉద్యోగి డ్రా చేసి సొంతానికి వినియోగించుకున్న ఘటన వెలుగుచూసింది. వరుసగా బ్యాంకుల్లో అంతర్గత సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడంతో బ్యాంకులపై ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.