దేశ రక్షణకు యువత నడుం బిగించాలి
నిర్మల్ పట్టణంలో తిరంగా ర్యాలీ.. పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): భారతదేశ రక్షణ కోసం నేటి యువత నడుంబిగించి ముందుకు కదలాలని బిజెఎల్‌పినేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన తిరంగా ర్యాలీ లో పాల్గొన్నారు.
పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువకులు, దేశభక్తులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తిని చాటారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో నిర్మల్ పట్టణం మార్మోగింది. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, అంబేద్కర్ చౌక్, పాత బస్టాండ్ మీదుగా వివేక్ చౌక్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ర్యాలీలో యువత చూపిన ఉత్సాహం చూస్తుంటే భారతదేశం ప్రపంచంలోనే విశ్వగురుగా అవతరించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.
‘వందేమాతరం’ గీతాన్ని దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలపించేలా ప్రధాని నరేంద్ర మోదీ చట్టబద్ధత కల్పించారని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించి యువతతో ప్రతిజ్ఞ చేయించారు. తిరంగా ర్యాలీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు చందు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






