5 August, 2026 | 4:41 AM

ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట

05-08-2026 01:30 AM
  1. గిరిజనుల నాగరికతను ప్రపంచానికి చాటేలా తీర్చిదిద్దుతాం
  2. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్, ఆగస్టు 4 : అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండల కేంద్రంలోని గోండు రాజుల చారిత్రాత్మక కోటను ఎకో టూరిజం కేంద్రంగా  తీర్చిదిద్దుతామని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. మంగళవారం గోండు రాజుల కోటను సందర్శించి పర్యాటక అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కోట పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, గోండు రాజుల చరిత్ర, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడతామని తెలిపారు. గోండు రాజుల కోట గిరిజనుల గొప్ప చరిత్రకు, వారి వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

గిరిజనుల నాగరికత, సంస్కృతి, వారసత్వాన్ని దేశ విదేశాల ప్రజలకు పరిచయం చేసే విధంగా కోటను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాధాన్యత, గిరిజన సంప్రదాయాల సమ్మేళనంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.

కోట పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నడక మార్గాలు, దిశా సూచిక బోర్డులు, విశ్రాంతి కేంద్రాలు, వీక్షణ స్థలాలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గోండు రాజుల చరిత్రను వివరించే సమాచార కేంద్రం, గిరిజన సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షిస్తూ ఆధునిక పర్యాటక సదుపాయాలను సమన్వయం చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.