5 August, 2026 | 3:39 AM

పెండింగ్ పనులను నిర్దేశిత గడువుల్లోగా పూర్తి చేయాలి

05-08-2026 01:30 AM

*ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం  మండల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యానికి తావు లేకుండా జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సర్పంచులతో సమన్వయం పెంచి గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, రెవెన్యూ శాఖ భూ సమస్యలు, ప్రజల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడటంతో అడ్మిషన్లు పెరిగాయని పేర్కొంటూ విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ కొనసాగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులపై సర్పంచులకు అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని పేర్కొంటూ, అధికారులు తమ శాఖలకు గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అందజేయాలని ఈ సందర్భంగా సర్పంచులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి,  ఎంపీడీవో, తాసిల్దార్ కిషన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.