మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
జిల్లా షీ టీమ్
సిరిసిల్ల, మే 6,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగలపల్లి మండల పరిధిలో మహిళల భద్రతపై జిల్లా షీ టీమ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. తాడూర్, గోపాల్రావుపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లే మహిళలను కలుసుకొని షీ టీమ్ అధికారులు సూచనలు చేశారు.
ఎలాంటి వేధింపులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425కు ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.సోషల్ మీడియాలో అపరిచితులతో మాట్లాడకూడదని, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని మహిళలకు సూచించారు. ఏప్రిల్ నెలలో జిల్లాలో వేధింపులకు పాల్పడిన వారిపై 4 ఎఫ్‌ఐఆర్లు, 2 పెట్టి కేసులు నమోదు చేసి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల, రవి, సిబ్బంది శ్రీలత, శ్రీనివాస్తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






