విద్యుదాఘాతంతో మహిళకు తీవ్ర గాయాలు
కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణానికి చెందిన శ్రీదేవి అనే మహిళ మామిడి తోటలో కూలీగా పని చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... శ్రీదేవి కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో కాయలు కోసేందుకు కూలీగా వెళ్లింది. తోటలో కాయలు కోస్తున్న సమయంలో చెట్లకు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా వెళ్లడంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, శరీరంపై కాలిన గాయాలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు.






