ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి
- ఏఐసీసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట,(విజయక్రాంతి): రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఏఐసీసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బంకెట్ హాల్ లో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆద్వర్యంలో శుక్రవారం జరిగిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడారు. వరి పండించడానికి ఒక కిలో ధాన్యానికి 2000 నుంచి 3000 లీటర్ల నీళ్లు అవసరమని అంతేకాకుండా ప్రతిసారి వరి పండించడం వలన భూసారం కోల్పోతుందన్నారు. దీంతో ఖర్చులు పెరిగి దిగబడి తగ్గిపోతుందన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగులవల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. కూరగాయల సాగు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఆయిల్ ఫామ్ కూరగాయల సాగు, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన రీతిలో అవగాహన కల్పించాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, అంతేకాకుండా గిట్టుబాటు ధరలు కూడా వచ్చే విధంగా చేయాలన్నారు. రైతులు పాడి పరిశ్రమ పై దృష్టి సారించాలని, 2012 నుండి తన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూచనల మేరకు, తన తల్లి పేరుమీద హయత్ నగర్ లో డైరీ నడిపిస్తున్నానన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతులకు సబ్సిడీతో యంత్రాలు అందిస్తుందని కాబట్టి రైతులు డ్రిప్ ఇరిగేషన్ వైపు మొగ్గు చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగారెడ్డి , వైస్ చైర్మన్ పంతంగి మల్సూరు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేష్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, ఆయిల్ ఫిడ్ ఇన్చార్జి అలీం, కె వి కే సీనియర్ సైంటిస్ట్ నరేష్ , ఇప్కో మేనేజర్ వెంకటేష్, జెకే పేపర్స్ మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.






