ఆఖరి గింజ కొనడమే లక్ష్యంగా..
- లారీలు సమకూర్చకుంటే క్రిమినల్ కేసులు
- కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్
మంచిర్యాల, మే 19 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సంబంధిత శాఖ అధికారుల పట్టింపులేని తనంతో నెమ్మదిగా సాగుతోంది. ఓ వైపు మబ్బులు, మరోవైపు అక్కడక్కడ అకాల వర్షాల నేపథ్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే కలెక్టర్ మునుపెన్నడు లేని విధంగా పగలు, రాత్రి కొనుగోలు కేంద్రాలను, మిల్లులను, గోదాములను పరిశీలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు, గోదాముల బాధ్యులకు సూచనలు ఇస్తూ వేగంగా కొనుగోళ్లు జరుపాలని ఆదేశాలిస్తున్నారు.
స్పెషలాఫీసర్ల ఏర్పాటు..
ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవద్దని జిల్లాలో మండలానికి ఒక స్పెషలాఫీసర్ ను నియమించిన కలెక్టర్ ప్రతిరోజు వారితో వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ ల ద్వారా మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 24 గంటలు అలర్ట్ గా ఉండాలని, వర్షాలు ప్రారంభానికి ముందే ప్రతి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం మిల్లులకు, గోదాములకు చేర్చాలని ఆదేశించడమే కాకుండా ప్రతి రోజు ఎంత ధాన్యం తూకం వేస్తున్నారు, ఎంత లోడింగ్ అవుతుందో తెలుసుకుంటున్నారు.
వాహనాలు సమకూర్చకుంటే కేసులు..
కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను సంబంధిత లారీ కాంట్రాక్టర్ సమకూర్చకుంటే కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆయా మండలాల తహశీల్దార్ లకు ఆదేశాలిచ్చారు. జిల్లాలో నాలుగు సెక్టార్లుగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తుండగా కొందరు రైతుల వద్ద నుంచి డబ్బుల వసూలు చేయడం కోసం లారీల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తన దృష్టికి రావడంతో ట్రాన్స్ ఫోర్టర్లతో, మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారిని హెచ్చరించారు. ప్రతి సెంటర్ కు రెండు నుంచి మూడు లారీలు పంపించాలని, రోజు 10 నుంచి 15 లారీలను మిల్లుల్లో అన్ లోడ్ చేయాలన్నారు.






