9 August, 2026 | 2:54 AM

పెట్టుబడుల హబ్‌గా తెలంగాణ

09-08-2026 01:31 AM
  1. రాష్ట్రంలో అపార అవకాశాలు
  2. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
  3. ప్రవాసులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): పెట్టుబడులకు తెలంగాణ హబ్‌గా ఉందని, రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని, అపార అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. వేమో డ్రైవర్లెస్ కారులో ఆయన ప్రయాణించి, హైదరాబాద్‌లో స్వయంచాలక మొబిలిటీపై ఆసక్తి వ్యక్తం చేశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ (సీజీఐ ఎస్‌ఎఫ్‌ఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బే ఏరి యాకు చెందిన తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. అనంత రం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పారిశ్రామిక కారిడార్లు, పార్కుల్లో తయారీ, ఐటీ, జీవశాస్త్రం, స్వచ్ఛ ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులకు అనువైన భూమి అందుబాటులో ఉందన్నారు.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీతో పాటు ఇతర విద్యా, సాంకేతిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందించే సామర్థ్యం ఉందన్నారు. సంప్రదాయ విద్యుత్‌తో పాటు పునరుత్పాదక ఇంధన వనరు రంగంలోనూ రాష్ట్రం గరిష్ట ప్రగతిని సాధిస్తోందని చెప్పారు. పెట్టుబడిదారు లకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నా మన్నారు. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ఈ అభివృద్ధి ప్రయాణంలో తెలంగాణ ప్రవాసులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క శాన్‌ఫ్రాన్సిస్కోలో వేమో స్వయంచాలక (డ్రైవర్లెస్) వాహనంలో ప్రయాణించారు. హైదరాబాద్‌తో పాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో స్వయంచాలక మొబిలిటీ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై ఆయన ఆరా తీశారు. నూతన తరం మొబిలిటీ సాంకేతికతను హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని భట్టి విక్రమార్క ఆసక్తి వ్యక్తం చేశారు.