పదేళ్లలో 152 పేపర్ లీకులు
- 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిత అంధకారం
- దేశంలో నిరుద్యోగులు 40 కోట్ల మంది
- ప్రతి 150 మందిలో ఒక్కరికే ప్రభుత్వ కొలువు
- యావత్ దేశ యువత ఒక్కటి కావాలి
- కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
- ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
- ప్రయాగ్‌రాజ్ ‘విద్యార్థి గళం’ కార్యక్రమంలో వ్యాఖ్యలు
లక్నో, ఆగస్టు ౮: గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, లీక్‌ల కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో శనివారం సాయంత్రం ఆయన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థి గళం) పేరిట విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిం చారు.
దేశ కాలమాన పరిస్థితులపై వారితో సుమారు గంటపాటు చర్చించారు. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందిలో కేవలం ౧౨ మందికి మాత్రమే, సెక్యూర్ ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలతో సహా వివరించారు. తన ప్రసంగంలో భాగంగా ‘దర్ద్, డేటా, దౌలత్” (బాధ, సమాచారం, సంపద) అనే మూడు అంశాలను లేవనెత్తారు. దేశంలోని 40 కోట్ల మంది నిరుద్యోగ బాధను అనుభవిస్తున్నారని అంచనా వేశారు. నేటి విద్యా వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు యువతను తీవ్రమైన చక్రవ్యూహంలో పడేశాయని ఆరోపించారు.
యువతకు సరైన అవకాశాలు ఇవ్వకుండా కేవలం సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేసేలా తీర్చిదిద్దుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా రీల్స్ చూడడం, చేయడం పరిపాటి అయిందని వాపోయారు. యువత రోజుకు ఎన్ని రీల్స్ అయినా చూసుకోవచ్చని, గిగ్‌వర్కర్లుగా మారి బ్లింకిట్, ఉబెర్ వంటి సంస్థల్లో పని చేసుకోవచ్చని, కానీ.. వారికి మాత్రం శాశ్వత ఉద్యోగాలు దక్కవని అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులు తమ కష్టార్జితమైన లక్షలాది రూపాయలను ఖర్చు చేసి పిల్లలకు బీఏ, ఎంఏ వంటి డిగ్రీ పట్టాలు ఇప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిగ్రీ సర్టిఫికెట్లు కేవలం కాగితపు ముక్కలుగా మిగిలిపోతున్నాయని, వాటివల్ల ఎలాంటి ఉద్యోగ హామీ లభించడం లేదని అభిప్రాయపడ్డారు. యువతకు దక్కాల్సిన దౌలత్ కొద్దిమంది పాలకులు, బడా వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.
డబ్బుంటే చాలు పరీక్ష పేపర్లు ఇంటర్నెట్, టెలిగ్రామ్ యాప్‌ల్లో దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు యావత్ దేశ యువత ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, హేతుబద్ధత లేని జీఎస్టీ విధానాల కారణంగా దేశీయ తయారీ రంగం దెబ్బతిన్నదని వివరించారు.
మన తయారీ రంగం దెబ్బతినడంతో దేశంలో ఎక్కడ చూసినా ‘మేడ్ ఇన్ ఇండియా’ కాకుండా ‘మేడ్ ఇన్ చైనా’, ‘మేడ్ ఇన్ వియత్నాం’ వస్తువులే దర్శనమిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌ల విషయానికి వస్తే, దేశంలోని బ్యాంకులు సామాన్య యువతకు, చిన్నవ్యాపారులకు రూపాయి రుణం ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు.
కేవలం అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకే కోట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే ప్రతి 150 మంది అభ్యర్థుల్లో ఒక్కరికే ఉద్యోగం వచ్చే దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల వేలాది కొలువులు తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు.
ప్రభుత్వ రంగాలు కుదేలు
2014 కంటే ముందు ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 14 లక్షల ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 7 లక్షలకు పడిపోయిందని తెలిపారు. కార్పొరేట్ ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశం వల్ల, ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
అదానీ సంపద పదేళ్లలో 30 రెట్లు పెరిగిందని, బీజేపీ నిధులు 150 కోట్ల నుంచి 10,000 కోట్లకు చేరుకున్నాయని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు, వార్తా సంస్థలు, న్యాయవ్యవస్థ, సాయుధ బలగాల వంటి స్వతంత్ర వ్యవస్థల్లో భావజాలాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.






