9 August, 2026 | 3:35 AM

నిధుల కొరత లేదు

09-08-2026 01:17 AM
  1. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాసానికి ప్రాధాన్యత 
  2. రూ.5 వేల కోట్ల విడుదలకు లైన్ క్లియర్ 
  3. ఇప్పటికే 2 వేల కోట్లు విడుదల.. త్వరలో మరో 3 వేల కోట్లు 
  4. అనుమతుల పేరుతో పనులు ఆగొద్దు.. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు 
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజె క్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం-పునర్నిర్మాణం కోసం ప్రాధా న్యత ప్రాతిపదికన రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఇప్పటికే రూ. 2 వేల కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ. 3 వేల కోట్ల విడుదల ప్రక్రియలో ఉందని తెలిపారు.

నిధుల కొరత కారణంగా పూర్తయ్యేందుకు చేరువలో ఉన్న ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా నిలిచిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై శనివారం నిర్వహించిన సమగ్ర సమీక్షలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను సాధారణ పరిపాలనా అంశాలుగా చూడకుండా అత్యంత ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపాలని, అవసరమైన ఆర్థిక అనుమతులు, టోకెన్లు పొందడంలో జాప్యంచేయవద్దని సూచించారు. ఇంజినీరింగ్ పనులు ఒకవైపు కొనసాగుతుండగానే సాధ్యమైన ప్రాంతాల్లో భూసేకరణ, భూ యజమానులకు పరిహారం చెల్లింపు, నిర్వాసిత కుటుంబాల పునరావాస ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని స్పష్టంచేశారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించిన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటి ఫలాలను రైతులకు అందించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు.

మిడ్ మానేరు ఎడమ కాలువ పనుల్లో కదలిక..

సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్ మానేరు ఎడమ కాలువ మిగులు పనులను తక్షణమే పునఃప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పనులకు అడ్డంకిగా మారిన భూసంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. సవరించిన అంచనాలు సిద్ధం చేయడం, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, చట్టబద్ధ అనుమతుల సాధన.. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి కాకుండా సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టంచేశారు.

ప్రక్రియల పేరుతో మరోసారి పనులు నిలిచిపోకుండా నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు కాకతీయ ప్రధాన కాలువలో డి-83 నుంచి డి-94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించే రెండు ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. లైడార్ సర్వే, డేటా ప్రాసెసింగ్ ఇప్పటికే పూర్తయ్యాయని, బోర్ హోల్ డ్రిల్లింగ్, ట్రయల్ పిట్స్, జియోటెక్నికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఆగస్టు నెలాఖరులోగా డీపీఆర్ సమర్పిస్తామని తెలిపారు. 

రోళ్లవాగు 96 శాతం పూర్తి.. 

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుపైనా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచి, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడం ప్రాజెక్టు లక్ష్యం కాగా, మూడు బండ్లు, సర్‌ప్లస్ వీర్, హెడ్ స్లూయిస్‌లతో సహా ప్రధాన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి.

అయితే బండ్- కొంత భాగం అటవీ భూమిలో ఉండటంతో మిగిలిన పనులు అటవీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రత్యామ్నా య అటవీకరణకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించడంతోపాటు వన్యప్రాణుల సంరక్ష ణకు సంబంధించిన మిటిగేషన్ ప్లాన్‌కు ఆమో దం లభించినట్లు అధికారులు వివరించారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగంగా పూ ర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రాజెక్టుల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక జాబితా సిద్ధం చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. ఏ ప్రాజెక్టులో ఏ సమస్య ఉంది? దా ని పరిష్కారానికి ఎంత నిధి అవసరం? ప్రస్తు తం ఏ దశలో ఉంది? ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? అనే అంశాలన్నింటినీ స్పష్టంగా నమోదుచేయాలని చెప్పారు. సమీక్షలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన ప్రతి సమస్యను ‘యాక్షన్ పాయింట్’గా మార్చాలని, తదుపరి సమావేశం నాటికి వాటిపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని అధికారులకు స్ప ష్టంచేశారు.

భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ లేదా అటవీ అనుమతుల కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు నిలిచిపోయినా వెంటనే ప్రతిపాదనలు పంపాలని, నిధులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రాజెక్టులను పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు మరింత ఆలస్యం లేకుం డా నీరు అందించడమే మా లక్ష్యం అని వెల్లడించారు. సమీక్షలో నాలుగు జిల్లాల కలెక్టర్లతో పాటు ఇంజినీర్-ఇన్--చీఫ్ (జనరల్) ఓవీ రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.