calender_icon.png 12 February, 2026 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే..

12-02-2026 02:06:36 AM

ఒత్తిళ్లు.. బెదిరింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం

  1. మక్తల్‌లో కాంగ్రెస్ తీరు దుర్మార్గం
  2. డబ్బునే నమ్ముకుని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయాలు 
  3. కార్పొరేషన్ల విభజన ఉల్లంఘనే 
  4. మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్రప్రభుత్వం
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే  కాంగ్రెస్ పార్టీ విపక్షాల అభ్యర్థులను బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మక్తల్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని, ఇది మక్తల్‌కే పరిమితం కాలేదని.. తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించిందని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు.

మంగళవారం మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనపై ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వ హించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పోలింగ్ బూత్‌ల వారీగా బహిరంగంగా, పోలీసుల సమక్షంలోనే, పోలింగ్ బూత్‌ల లోపల, బయటా విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసిందని, దీనిపై ‘మేము పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేదా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు’ అని అన్నారు.

రాష్ర్టంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదా అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు డబ్బు రాజకీయాలనే నమ్ముకుని ఎన్నికల్లో పాల్గొ న్నాయని ఆరోపించారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది ఐఏఎస్, వివిధ శాఖల అధికారులను బదిలీ చేసిందని మండిపడ్డారు. అయినా ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించబోతోందని అన్నారు.

విధివిధానాల ఉల్లంఘన..

గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం కూడా ఎన్నికల కమి షన్ విధివిధానాలను ఉల్లంఘించినట్లే అని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ హెడ్‌క్వార్టర్స్‌కు దూరంగా ఉన్న ప్రాం తాలను కూడా కార్పొరేషన్లలో కలిపారని, దీనివల్ల ఆ గ్రామాల పేద ప్రజలకు అన్యా యం జరుగుతోందన్నారు. 2007లో ఏర్పడిన జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650 చ.కి.మీ. కాగా, ఇప్పుడు 3 కార్పొరేషన్లు కలిపి 2053 చ.కి.మీ.కు పెం చారని, కానీ ఈ విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల ప్ర ణాళిక లేదని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ విభజనపై ఎటువంటి అభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.

సెన్సెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని దేశవ్యాప్తంగా రాజ్యాం గబద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్, నల్లగొండ, హైదరాబాద్ కార్పొరేషన్లను విభజించిందని, ఇది పూర్తిగా చట్టవ్యతిరేక నిర్ణ యమని మండిపడ్డారు. డిసెంబరు 31, 2025 తర్వాత ఎలాంటి మార్పులూ చేయరాదని, అవసరమైతే మే 2027 వరకు వేచి చూడాలని సెన్సస్ డైరెక్టరేట్ స్పష్టంగా పేర్కొనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శ కాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. 

కొన్ని ఓఆర్‌ఆర్ లోపల మరికొన్ని బయట..

ఓఆర్‌ఆర్‌ను సరిహద్దుగా తీసుకుంటామని చెప్పినా, కొన్ని ప్రాంతాలు ఓఆర్‌ఆర్ బయట, మరికొన్ని లోపల ఉంచారని, ఎయిర్‌పోర్టు, బీహెచ్‌ఈఎల్, ఇక్రిసాట్ వంటి కీలక ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి మినహాయించిందన్నారు. మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి ప్రాంతాల్లోని మజ్లిస్ ఆధిప త్యం కలిగిన ప్రాంతాలను కోర్ జీహెచ్‌ఎంసీలో చేర్చారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్-ఆర్ ట్యాక్స్ పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతోందని, ఎన్‌వోసీలు, ల్యాండ్ పర్మిషన్లు, భూముల రిజిస్ట్రేషన్లు లేదా ల్యాండ్ డాక్యమెంటేషన్ వంటి మార్పుల కోసం కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు ఆర్-ఆర్ ట్యాక్స్ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. బెంగళూరులో ఆర్-ఆర్ ట్యాక్స్ 12 శాతం వసూలు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 30 శాతం వరకు వసూలు చేస్తోందని ఆరోపించారు. 

జీహెచ్‌ఎంసీ విభజన అశాస్త్రీయం..

జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలుగా అశాస్త్రీయ విభజన చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, ‘మేము కూడా మూసీ శుద్ధి కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కానీ మున్సిపాలిటీల్లో సరైన వసతులే లేవు, 50 శాతం సిబ్బంది కొరత ఉంది, శానిటేషన్ తూతూమంత్రంగా జరుగుతోంది, ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటోందన్నారు.

మొత్తంగా, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ల ఏర్పాటులో స్టేట్ ఎలక్షన్ కమిషన్ విధివిధానాలు, సెన్సస్ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్‌వీ సుభాష్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, పార్టీ సీనియర్ నాయకులు జీ వెంకట్‌రెడ్డి, సునీత, రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.