29 May, 2026 | 2:55 AM

రైతు కన్నీళ్లు తుడవడమే ధ్యేయం

29-05-2026 12:47 AM
  1. హరీశ్‌రావు.. కట్టుకథలు మానుకోండి
  2. మొక్కజొన్న కొనుగోళ్లకు ఐదు వేల కోట్లు విడుదల
  3. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, మే 28 (విజయక్రాంతి): హరీశ్‌రావు మాట్లాడుతున్నవి కట్టుకథలేనని.. పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఆయన పచ్చి అబద్దాలు ఆడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ హిత ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గర్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు చిన్నబీరవల్లి గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్‌లో భాగం గా ఈ ఇంటింటి పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తుని ప్రారంభించారు. అనంత రం గార్లపాడులోని రైతు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్లను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం వార్తల్లో ఉండటం కోసమే మాజీమంత్రి హరీశ్‌రావు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతులకు ప్రజా ప్రభుత్వం చేస్తు న్న మంచిని చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బోనకల్, కొడంగల్‌లను పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణ సోలరైజేషన్ మండలాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి కేవలం నీటిని అందించడమే కాకుండా మిగులు విద్యుత్ ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రెడ్కో సంస్థ రూపొం దించిన ప్రత్యేక సోలార్ షెడ్లను ఆయన అభినందించారు. ఇవి పొలాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా, రైతులకు విశ్రాంతి గదులుగా, సామాగ్రి దాచుకునే షెడ్లుగా ఉపయో గపడతాయన్నారు. రైతులకు సాగుతో పాటు విద్యుత్ ద్వారా ఆదాయం రావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని.. ఆ సంకల్పంతోనే పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.

తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ఈ ప్రాజెక్టులు మైలురాళ్లుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తమ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పత్తిని పెంచాలని భావిస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించగలుగుతున్నామని ఆయన తెలిపారు.

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) తోనే ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఆర్థిక శాఖ నుంచి ఐదువేల కోట్ల రూపాయల ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అదనంగా 17 వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరిందన్నారు. 

బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ఎంత కొనుగోలు చేసిందో.. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ అంతా కొనుగోలు చేసిందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ పార్టీకి ఆయన సవాల్ విసిరారు.కళ్లాల్లో పర్యటిస్తున్న బీజేపీ నేతలు కేంద్రం ఎందుకు ధాన్యాన్ని సేకరించడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రం కొనుగోలు చేసిన ప్రతి గింజను కేంద్రం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ట్రాన్స్ కో సీఎండీకృష్ణ భాస్కర్, టీజీ ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీ  అనిల, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.