23 July, 2026 | 2:43 AM

బైండోవర్ అవుతారా.. కేసులు పెట్టమంటారా..

23-07-2026 01:46 AM

గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఎస్‌ఐ బెదిరింపులు.. 

తాడ్వాయి,జూలై, 22( విజయ క్రాంతి ): సక్రమంగా బైండోవర్ అవుతారా.. లేదంటే కేసులు నమోదు చేయమంటారా.. అంటూ తాడ్వాయి పోలీసులు బెదిరిస్తున్నారని కన్కల్ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన గ్రామస్తులతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో ఓ మంచి కార్యక్రమానికి తాను పూనుకుంటే కొందరు గ్రామంలో పడిరాని వ్యక్తులు చెప్పిన మాటలు విని తాడ్వాయి ఎస్‌ఐ నరేష్ మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచ్ గా ప్రథమ పౌరుడిగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడు తున్న తనను తనను బైండోవర్ ఎందుకు చేస్తారని చేస్తారని ఆయన ప్రశ్నించారు. గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో గతంలో 108 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం తాను విద్యార్థుల తల్లిదండ్రులతో, గ్రామ పెద్దలతో మాట్లాడి అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి 280 మంది విద్యార్థుల సంఖ్యకు తీసుకువచ్చానని తెలిపారు.

గ్రామంలో అందరూ ప్రభుత్వ పాఠశాలకు మద్దతు ఇస్తుండగా గ్రామంలోని ఓ నలుగురు వ్యక్తులు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. వారు చెప్పిన మాటలు వారు ఇచ్చిన ఫిర్యాదులను పట్టుకొని ఎస్త్స్ర నరేష్ మమ్మల్ని బెదిరిస్తున్నారని సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. మీరు బైండోవర్ అవుతారా... లేదంటే అందరిపై  కేసులు కట్టు మంటారా అని హెచ్చరిస్తున్నారన్నారు.

తాము గ్రామంలో మంచి పనులు చేస్తుంటే కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు ఉన్నాయని మిమ్మ ల్ని కచ్చితంగా బైండోవర్ చేస్తామని ఎస్త్స్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తాము తప్పు చేస్తే తలవంచుతామని, తాము ఎలాంటి తప్పు చేయనిది బైండోవర్ ఎలా చేస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. 

ఎలాంటి విచారణ లేకుండానే.. బైండోవర్ కు ఆదేశాలు..

బైండోవర్ చేయాలంటే ప్రాథమికంగా గ్రామంలో విచారణ చేయాలి కానీ తాడ్వాయి ఎస్త్స్ర గ్రామంలో ఎలాంటి విచారణ చేయకుండానే మమ్మల్ని తహసిల్దార్ ఎదుట ఎలా బైండోవర్ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు ఉన్నాయని మిమ్మల్ని ఖచ్చితంగా బైండోవర్ చేస్తామని ఎస్‌ఐ చెప్పటం బాధాకరంగా ఉందన్నారు. కామారెడ్డి పట్టణంలోని వాగ్దేవి, గౌతమి మోడల్ స్కూల్,శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యాలు కావాలని కొందరు కన్కల్ గ్రామస్తులతో కలిసి మీరు కలెక్టర్ దగ్గరకు, ఎస్పీ దగ్గరికి వెళ్లి కేసులు పెట్టండని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

కామారెడ్డి పట్టణంలోని వాగ్దేవి పాఠశాల యాజమాన్యం తమకు రావాల్సిన ఆదాయం కన్ కల్ గ్రామం నుంచి కోల్పోతున్నామనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. వాగ్దేవి పాఠశాలలో కొందరు ప్రభుత్వ  ఉపాధ్యాయులు భాగస్వాములుగా ఉన్నారని ఆ ఉపాధ్యాయులు సైతం కేసులు పెట్టండి అని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

గ్రామంలో మంచి కార్యక్రమం చేయడం కోసం తాను కట్టుబడి ఉన్నానని ఎక్కడా లేనివిధంగా గ్రామాభివృద్ధికి పాల్పడుతుంటే కొందరు పనిగట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉప సర్పంచ్ మహేందర్ ను పోలీసులు బైండోవర్ చేయగా బుధవారం తనను బైండోవర్ చేస్తున్నారని తెలిపారు.

పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడేది లేదని అభివృద్ధి కోసమే ముందుకు వెళ్తానని తెలిపారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐ కొండల్ రెడ్డి  తో వాగ్వాదం పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, నాయకులు గడ్డం కిష్టారెడ్డి, ఏను వెంకటరెడ్డి, భూపతిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ బైండోవర్..

కన్ కల్ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డిని పోలీసులు బుధవారం తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సర్పంచ్ రవీందర్ రెడ్డి గ్రామస్తులతో కలిసి తహాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి బైండోరయ్యారు.