27 June, 2026 | 2:18 AM

అల్లుడి పేర పొలం చేయలేదని.. భర్త ప్రాణం తీసిన భార్య

27-06-2026 12:56 AM

భార్యతో పాటు కూతురు, అల్లుడు అరెస్ట్

నాగర్ కర్నూల్, జూన్ 26 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో ఆస్తి, అక్రమ సంబంధం వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. తిమ్మాజిపేట్ మండలం ఆవంచ గ్రామానికి చెందిన యాదయ్య (52)ను హత్య చేసిన కేసులో అతని భార్య అలివేల, కుమార్తె పద్య, అల్లుడు ఆంజనేయులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన  వివరాల ప్రకారం, 1:20 గుంటల భూమిని అల్లుడు పేర పట్టా చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, అందుకు యాదయ్య నిరాకరించడంతో పాటు భార్య అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో జూన్ 23న ముగ్గురు కలిసి యాదయ్యపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, అంత్యక్రియలకు ముందు మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గాయాలను గుర్తించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టు ప్రక్రియలో సీఐ అశోక్ రెడ్డి, తిమ్మాజిపేట ఎస్త్స్ర శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.