27 June, 2026 | 2:51 AM

వ్యూహాలకు పదును!

27-06-2026 01:37 AM
  1. తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ అడుగులు
  2. వచ్చే ఎన్నికల కోసం భారీ ప్రణాళికలు
  3. సునీల్ బన్సాల్‌కు రాష్ట్ర బాధ్యతలు 
  4. పార్టీ ఎన్నికల ఇంజనీర్‌గా బన్సాల్‌కు ఇప్పటికే గుర్తింపు 
  5. యూపీ, బంగాల్ విజయాల వ్యూహకర్త
  6. తెలంగాణలోనూ అనేక సవాళ్లు
  7. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు తెలంగాణ మైలురాయిగా మారనుందా?

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించింది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం, నేతల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహాలను రూపొందించడం వంటి కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విశ్వాసపాత్రుడైన బన్సాల్.. బీజేపీలో ఎన్నికల ఇంజనీర్‌గా గుర్తింపు పొందారు. అసాధ్యమనుకున్న లక్ష్యాలను విజయాలుగా మార్చగల వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. పశ్చిమబంగాల్‌లో ఊహించని రీతిలో పార్టీకి భారీ విజయాన్ని అందించింది ఆయనే.

రాజస్థాన్‌కు చెందిన ఈ ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతకు ఇప్పుడు తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న తెలంగాణలో బీజేపీని అగ్రస్థానానికి తీసుకురావడం ఆయన ముందున్న ప్రధాన సవాల్.

బన్సాల్ వ్యూహాలతో అద్భుత ఫలితాలు

సునీల్ బన్సాల్ ప్రస్థానం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థి రాజకీయాలతో ప్రారంభమైంది. 1989లో రాజస్థాన్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన బన్సాల్.. 1990లో పూర్తిస్థాయి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా మారారు. సంఘ్ పరివార్‌లో లభించిన క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన పునాది ఆయనను క్షేత్రస్థాయి కేడర్ నిర్మాణం, బూత్ స్థాయి నిర్వహణపై దృష్టి పెట్టేలా చేశాయి. నేటి తరం నాయకుల ఆర్భాటాలకు భిన్నంగా, తెరవెనుక ఉంటూ వ్యూహాలు రచించే ఆయన శైలి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ వస్తోంది.

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బన్సాల్ రాజకీయ ప్రస్థానం ఊపందుకుంది.ఉత్తరప్రదేశ్‌లో అమిత్‌షాకు సహాయకుడిగా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అక్కడ 80 స్థానాలకు గానూ 71 స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

ఓటర్ల సమూహాలకు ప్రత్యేక కార్యకర్తలను కేటాయించే పన్నా ప్రముఖ్ విధానం, క్షేత్రస్థాయిలో బూత్ మేనేజ్‌మెంట్ ఆయన విజయ సూత్రాలుగా మారాయి. ఆ తర్వాత యూపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా 2017 అసెంబ్లీ ఎన్నికలు (312 స్థానాలు), 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 ముందస్తు విజయాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనపడుతుంది. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

బంగాల్ విజయం ప్రత్యేకం   

బీజేపీ జాతీయ నాయకత్వం 2022లో సునీల్ బన్సాల్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించి పశ్చిమ బంగాల్, ఒడిశా రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది. తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్న పశ్చిమబంగాల్‌లో బీజేపీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మార్చడం ఆయనకు పెద్ద సవాల్‌గా నిలిచింది. వేలాది పోలింగ్‌స్టేషన్లలో క్రియాశీల బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం, సామాజిక సమీకరణలు, కేడర్‌ను నిరంతరం సమాయత్తం చేయడం ద్వారా ఆయన అక్కడ పార్టీని బలోపేతం చేశారు.

దీని ఫలితమే ఇటీవల 2026 ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం. బీజేపీ జాతీయ భావజాలానికి గట్టి వ్యతిరేకత ఉండే బంగాల్ వంటి రాష్ట్రంలో తాజా ఫలితాలు ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచాయి. ఇప్పుడు, అదే విజయవంతమైన వ్యూహాన్ని తెలంగాణలో బన్సాల్ అమలు చేయనున్నారు. ఇక్కడ ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన వాగ్ధాటి, ఆర్థిక వనరులు, మరియు క్షేత్రస్థాయి అనుభవంతో దూసుకుపోతోంది.

మరోవైపు.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్), కేటీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి బలమైన స్థానిక నాయకత్వం, క్యాడర్‌తోపాటు తెలంగాణ సెంటిమెంట్‌తో కూడిన సుదీర్ఘ అనుబంధం ఉన్నాయి. సంప్రదాయకంగా ఇక్కడ మూడో స్థానంలో ఉన్న బీజేపీకి ఇది కష్టతరమైన పనే అయినప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేకత, మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో వారికి అవకాశం ఉందని భావిస్తోంది.

బన్సాల్‌కు సానుకూల అంశాలు

బన్సాల్‌కు బలమైన వనరులు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ కేడర్ మద్దతు, హిందుత్వ సిద్ధాంతం, మోదీ, -షాల వ్యక్తిగత అండదండలతోపాటు జాతీయ స్థాయి సంస్థాగత బలం ఆయనకు గట్టి సానుకూలాంశాలు. గవర్నర్ వ్యవస్థ జోక్యం, మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, ఉప ఎన్నికలు, ప్రత్యర్థి పార్టీల నుండి వలసలు, డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం వంటి వ్యూహాత్మక అస్త్రాలను బీజేపీ ఇక్కడ ఉపయోగించనుంది. అలాగే ప్రత్యర్థి పార్టీల అవినీతి, వైఫల్యాలను ఎండగడుతూ జాతీయ సమగ్రత, ప్రగతిశీల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది.

తెలంగాణలో బలమైన క్యాడర్ కొరత

తెలంగాణలోనూ సవాళ్లు తక్కువేమీ కావు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన స్థానిక నాయకుల కొరత ఉంది. ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న క్రేజ్, ఆయన ఒక్క బస్సు యాత్ర సృష్టించే ప్రభావం, ప్రతి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న పట్టు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మక చతురత, యువ నాయకత్వం కూడా గట్టి పోటీని ఇస్తున్నాయి.

ఈ తరుణంలో బన్సాల్ త్వరితగతిన స్థానిక నాయకత్వాన్ని నిర్మించాల్సి ఉంది, అలాగే తెలంగాణ సెంటిమెంట్‌కు అనుగుణంగా జాతీయ ప్రయోజనాలను జోడిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఎంత సీరియస్‌గా ఉందో బన్సాల్‌కు బాధ్యతలు అప్పజెప్పడం స్పష్టం చేస్తోంది. ఆయన శైలి కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు, పక్కా ప్రణాళికతో సాగుతుంది.

యూపీలో 50 కుటుంబాలకు ఒక ఓటర్ స్లాబ్‌ను, బంగాల్లో 65,000 పైగా బూత్‌లలో కమిటీలను విజయవంతంగా నిర్వహించిన ఆయన, తెలంగాణలోనూ అదే తరహా వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి హామీలు, సంస్థాగత బలంతో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో జరగబోయే ఈ పోరు మూడు బలమైన శక్తుల మధ్య రాజకీయ కురుక్షేత్రం కానుంది. 

బంగాల్ మ్యాజిక్ పునరావృతం చేస్తారా?

తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తే, అది దక్షిణాదిలో ఆ పార్టీ విస్తరణకు ఒక మైలురాయిగా మారడంతో పాటు బన్సాల్ వ్యూహాత్మక రాజకీయ చతురతను మరోసారి నిరూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ సమీకరణాలు మారితే, అది రాష్ట్రంలోని మిగతా పార్టీల వ్యూహాలను కూడా మార్చే అవకాశం ఉంది. బన్సాల్ ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంటూ, ఫలితాలకే ప్రాధాన్యతనిచ్చే సంఘ్ తరహా నాయకుడు.

బెంగాల్లో ఆయన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సీటు లభిస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆయన దృష్టి మాత్రం ప్రస్తుతం తెలంగాణపైనే ఉంది. ఈ నిశ్శబ్ద కమాండర్ తెలంగాణలోనూ తన బెంగాల్ మ్యాజిక్‌ను పునరావృతం చేస్తారా లేదా అనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత ఇమేజ్ చుట్టూ తిరిగే నేటి రాజకీయాల్లో, అఖండ విజయాల వెనుక ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద శ్రమ ఉంటుందని సునీల్ బన్సాల్ నిరూపిస్తున్నారు.