27 June, 2026 | 3:07 AM

శ్రీరాముడి నిధులు స్వాహా

27-06-2026 01:44 AM
  1. అయోధ్య రామమందిర విరాళాలు బొక్కిన ప్రబుద్ధులు
  2. రంగంలోకి ‘సిట్’.. ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్ట్
  3. రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ రాజీనామా
  4. దర్యాప్తు వేగవంతం.. ప్రస్తుతం అరెస్ట్‌లు, రాజీనామాల పర్వం

లక్నో, జూన్ ౨౬: ఉత్తరప్రదేశ్‌లోని అయో ధ్య శ్రీరామమందిర విరాళాల దుర్వినియో గం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ప్రస్తు తం అరెస్ట్‌లు, రాజీనామాల పర్వం నడుస్తున్నది. ఆలయ నిధుల మళ్లింపు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ అయోధ్య అని పేరున్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆయనతో పాటు ట్రస్టుకు చెందిన మరో సభ్యుడు అనిల్ మిశ్రా సైతం తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ కేసులో ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్.. మొత్తం ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నిందితులు అరెస్ట్ అయిన మరుసటి రోజే చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామాచేయడం గమనార్హం. ఆయన అక్రమార్కుల పక్షాన నిలిచి, వారిని  రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే చంపత్‌రాయ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ట్రస్ట్ నిధులను పర్యవేక్షించే బాధ్యత జనరల్ సెక్రటరీగా ఆయనపైనే ఉంది. కానీ, తన బాధ్యతలు నిర్వర్తించే విషయంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.

దాదాపు రూ. 7కోట్ల నుంచి రూ.7.5 కోట్ల నిధులు దారి మళ్లినట్లు  మాయమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. చంపత్‌రాయ్ డ్రైవర్, ఆప్తమిత్రుడైన రమాశంకర్ యాదవ్ అలియాస్ తిన్నూ అరెస్ట్‌తో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నగదు లెక్కింపు సిబ్బందితో పాటు పోలీసులు నిధుల లెక్కలను పర్యవేక్షించిన ఒక విశ్రాంత బ్యాంకర్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు.

మొదట్లో ఈ ఆరోపణలను చంపత్‌రాయ్ తోసిపుచ్చినప్పటికీ, తర్వాత రాష్ట్రప్రభుత్వం సిట్‌ను నియమించడంతో ఆ తర్వాతి పరిణామాలు మారిపోయాయి. మరోవైపు, నిధుల మళ్లింపై అంశంపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి సిట్ ప్రాథమిక నివేదిక సైతం సమర్పించింది. నివేదికలో అక్రమాల వెనుక ఎనిమిది మంది నిందితుల పేర్లను ప్రధానంగా పేర్కొంది.

కింది స్థాయి ఉద్యోగులే బలిపశువులా?

నిధుల నిర్వహణ, పర్యవేక్షణలో వైఫల్యాలు ఉన్నప్పటికీ, ట్రస్టీలను మాత్రమే వారి బాధ్యత నుంచి తప్పించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే ఈ కేసులో బలిపశువులను చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సిట్ నియమించడం మాత్రం కీలకమైన నిర్ణయమేనని రామభక్తులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రికి ట్రస్ట్ సభ్యుల నియామకంలో గానీ, నిధుల నిర్వహణతో ఎలాంటి ప్రమేయం లేదు. అయినప్పటికీ ట్రస్టీల అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరగడం అసాధ్యమనే భావన సామాన్య హిందుత్వ మద్దతుదారుల నుంచి వ్యక్తమవుతున్నది. మరోవైపు, 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అవినీతి అంశం బీజేపీపై మచ్చగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రస్ట్ పరిధిలో ఆది నుంచి వివాదాలే..

2020లో శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైంది. అప్పటినుంచి ట్రస్ట్‌ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో ఆలయ భూముల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. నకిలీ వెబ్‌సైట్ ద్వారా ప్రసాదం పేరిట వసూళ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసకోవడం సంభవించింది. ఇప్పుడు నేరుగా నగదు, బంగారం, వెండి ఇటుకల రూపంలో వచ్చిన కానుకలను దారిమళ్లించారనే ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది.

ఆలయ ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలను బహిరంగపరచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింధీ భక్తుల బృందం సమర్పించిన 200 వెండి ఇటుకలకు సరైన రశీదులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ ధార్మిక ట్రస్ట్‌గా నమోదైన ఈ సంస్థ ఖాతాలను పారదర్శకంగా ఉంచాల్సి ఉండగా, భక్తులకు ఆ సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపమని చెప్పవచ్చు.

తాజా వివాదం అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న అసలైన కర్ సేవకులకు, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారికి మధ్య ఉన్న విభేదాలనూ  బట్టబయలు చేసింది. 1990లో పోలీసు కాల్పుల్లో గాయపడిన కర్ సేవకుడు సంతోష్ దూబే వివాదంపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు.

విరాళాల దోపిడీ చాలా కాలంగా సాగుతున్నదని, ప్రస్తుత ట్రస్ట్‌లో ఉన్నవారెవరూ శ్రీరామజన్మభూమి ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కాదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడైన, ఆలయ నిర్మాణ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ నపేంద్ర మిశ్రా కూడా విరాళాల దోపిడీ జరిగినట్లు అంగీకరించడం కలకలం రేపింది.

దోషులను విడిచిపెట్టేది లేదు!

  1. నిధుల దుర్వినియోగం వెనుక దోషులను గుర్తిస్తాం
  2. సనాతన ధర్మం, ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడితే ఉపేక్షించం
  3. ఆ విషయంలో మాది ‘జీరో టోలరెన్స్’ విధానం
  4. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెచ్చరికలు 

లక్నో, జూన్ ౨౬: అయోధ్య రామమందిర నిధుల అంశాన్ని తమ ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదని, నిధుల దుర్వినియోగం వెనుక ఉన్నవారు, ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హెచ్చరించారు.  కేసు విషయం తేల్చేందుకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించామని, నిధుల దుర్వినియోగంతో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేయించామని గుర్తుచేశారు.

ఆలయ నిధుల మళ్లింపుపై శుక్రవారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.  అందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని వ్యాఖ్యానించారు. నిధుల దుర్వినియోగంపై భక్తులెవరూ చింతించవద్దని పిలుపునిచ్చారు. గతంలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే, ఇప్పుడు నిధుల దుర్వినియోగంపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలనుద్దేశించి నిప్పులుచెరిగారు.

ఆలయ పనులను అడ్డుకునేందుకు కోర్టుల్లో పోరాడినవాళ్లే ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడటం విచిత్రమంటూ ఎద్దేవా చేశారు.  ప్రజల విశ్వాసాలను స్వార్థం కోసం వాడుకునే వారిని తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఆ విషయంలో తమ ప్రభుత్వానిది ‘జీరో టోలరెన్స్’ విధానమని స్పష్టం చేశారు. అయోధ్య రామమందిర గౌరవాన్ని, విలువలను కాపాడటమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు.