27 June, 2026 | 3:32 AM

ఆగస్టు నాటికి ఫ్యాక్టరీ ప్రారంభం

27-06-2026 02:10 AM

కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల 

ఖమ్మం, కల్లూరు, జూన్ 26(విజయక్రాంతి): పామాయిల్ సాగు తెలంగాణ రైతాంగానికి వరంగా మారిందని దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా తెలంగాణ రాష్ట్రం మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియో జక వర్గం వేంసూర్ మండలం కల్లూరు గూడెం వద్ద కొత్తగా నిర్మాణం చేస్తున్న పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాలనలో పామాయిల్ సాగు విస్తరణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగులో ఉండగా నూనె గింజలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 36 శాతం సాగు విస్తరణతో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతి ఏడాది భారత దేశంలో వంట నూనెల దిగుమతులు కోసం  లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి నూనెలు దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉండగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ ఇంపోర్ట్ టాక్స్ 44 శాతం పెంచితే దేశీయంగా రైతాంగానికి మద్దతు ధరలు పెరుగుతాయని స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ టాక్స్ పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ప్రహ్లాదజోషి గారులను ఇటీవల డిల్లీలో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.

ప్రస్తుతం పామాయిల్ ఫ్రూట్ బంచ్ టన్ను గెలలు ధర 23,852 రూపాయలు ఉందని, కనీస గ్యారంటీ ధర పాతిక వేల రూపాయలు గా కేంద్రం ప్రకటించాలని కోరినట్లు గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఉండగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉండగా ఖమ్మం జిల్లాలో కల్లూరు గూడెం ..కొణిజర్ల గద్వాల జిల్లా బీచ్ పల్లి  ములుగు జిల్లా ఇంచర్ల  పెద్దపల్లి వనపర్తి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. 

ఈ  ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు మాసంలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అధికారులు కృషి చెయ్యాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రైతు భరోసా రైతు భీమా పథకం ఉచిత విద్యుత్ సరఫరా తో పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ చేస్తే తెలంగాణ లో గ్రీన్ కవర్ పెరగటంతో పాటు రాష్ట్ర ఆర్ధిక ప్రగతిలో  పామాయిల్ సాగు ముఖ్య భూమిక వహించ నున్నని అని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా రైతులు పామాయిల్ సాగు చేపట్టాలని మంత్రి తుమ్మల రైతాంగాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.