మక్క రైతుల దుఃఖం
నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించని సర్కార్
- 16 లక్షల టన్నులకు పైగా కొనుగోలు
- రూ.1,600 కోట్లకు పైగా బకాయిలు
- ఒక్క ఖమ్మం జిల్లాలోనే 300 కోట్లు పెండింగ్
- అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
- వానకాలం సాగుకు పెట్టుబడి ఇబ్బందులు
- వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్న అన్నదాతలు
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): పండించిన పంటలను విక్రయిం చిన తర్వాత రావాల్సిన డబ్బుల కోసం రైతులు నెలల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. దుక్కి దున్ని విత్తనం నాటిన నుంచి ఎరువులు, కూలీల ఖర్చులు ఒకవైపు.. పంట కోతకు వచ్చేవరకు పెట్టుబడి ఖర్చు లు మరోవైపు.. తడిసి మోపెడై చివరకు రైతుకు మిగిలేది రోజువారి కూలియే!.
ఇలాంటి పరిస్థితుల్లో పంటను అమ్ముకున్న రైతుకు రావాల్సిన డబ్బులు ప్రభు త్వం ఇవ్వకపోవడంతో అరిగోస పడాల్సి వస్తోన్నది. యాసంగిలో రైతుల నుంచి సుమారు 16 లక్షల టన్నులకు పైగా మక్కలను కొన్న ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2,300 కోట్లకు పైగా చెల్లించగా ఇంకా రూ.1,600 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది.

రాష్ట్రంలో యాసంగిలో 43.18 లక్షల టన్నుల మక్కల ఉత్పత్తి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేయగా 21.59 లక్షల టన్నులు కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రవ్యాప్తం గా 336 కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకు రైతుల నుంచి సుమారు 16 లక్షల టన్నులకు పైగా మక్కలను క్వింటాకు రూ. 2,400 చొప్పున మద్దతు ధరకు కొనుగో లు చేసింది. రైతులకు రూ.3,900 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వర కు రూ.2,300 కోట్లకు పైగా చెల్లించినట్టు తెలిసింది.
ఇంకా రూ.1600 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టుగా తెలిసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రూ.789 కోట్లకు గాను రూ.489 కోట్లు చెల్లించిన ప్రభుత్వం ఇంకా రూ.300 కోట్ల వరకు మక్కల పైసలు ఇవ్వాల్సి ఉంది. నాగర్‌కర్నూల్, మెదక్, నిజాబాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా దాదాపు రూ.250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు రైతులకు చెల్లించా ల్సి ఉందని రైతు సంఘాలు చెపుతున్నాయి. మక్కలు అమ్ముకుని నెలలు గడుస్తున్నా రైతులకు పైసలు విడుదల చేయకపోవడం తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటికీ డబ్బులు మాత్రం ఖాతాల్లో జమ చేయడం లేదనే విమవర్శలు వినిపిస్తున్నా యి. అయితే మక్కల కొనుగోలు కోసం ఎ న్సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్ రూ.4వేల కోట్ల వ రకు రుణం తీసుకున్నది. మక్క రైతుల కో సం తీసుకున్న రుణంలో సగం డబ్బులు పాత రుణాలను చెల్లించినట్టుగా తెలిసింది. దీంతో మక్క రైతులకు చెల్లింపులు ఆలస్యం చేస్తున్నట్టుగా సమాచారం.
వానకాలం సాగుపై ఆశతో..
వానకాలం మొదలుకావడంతో మక్కల పైసలొస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయ నే ఆశలతో రైతులు ఉన్నారు. విత్తనాలు, ఎ రువులు, దున్నకాలు, కూలిపనులకు ఇలా పలు అవసరాల కోసం రైతులు తిప్పలు ప డుతున్నారు. రావాల్సిన డబ్బులను ఎప్పు డు విడుదల చేస్తారోనని కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని రై తులు గగ్గోలు పెడుతున్నారు.
బకాయిల కో సం రైతులు క్షేత్రస్థాయిలో అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం రేపూ, మాపు అంటూ దాటవేస్తున్నారు. రుణం ఇంకా రాలేదని, చెల్లింపులకు సమ యం పడుతుందని అధికారులు చెపుతున్నట్టుగా తెలిసింది. అమ్మిన పంటల పైస లైనా త్వరగా ఇస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయని రైతులు భావిస్తున్నారు.
సన్నాల బోనస్ బకాయిలు 700 కోట్లు
సన్నధాన్యానికి చెల్లించాల్సిన బోన స్ చెల్లింపులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ యాసంగిలో రైతుల నుంచి 14 లక్షల టన్నుల సన్నధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ మేరకు బోనస్ కింద రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా.. బోనస్ నిధులను సర్కార్ ఎప్పుడు విడుదల చేస్తుందోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో నిర్వహించే రైతు ఆశీర్వద సభలోనైనా ప్రభుత్వం పంటల పెండింగ్ బకాయిలు విడుదల చేస్తుందా? మరోసారి వాయిదా వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.






