1 September, 2026 | 1:52 AM

తాడ్వాయి చైర్మన్ గిరి ఎవరికి దక్కేనో..

01-09-2026 12:00 AM

ఎదురుచూస్తున్న ఆశావాహులు..ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు..

తాడ్వాయి,ఆగష్టు,31( విజయ క్రాంతి ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం చైర్మన్ పదవులు భర్తీ చేస్తుందని  తెలిసిన నాటి నుంచి ఆశావహులు చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.ఎలా వీలైతే అలా నాయకులను సంప్రదిస్తూ తనకే పదవి దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ గిరి కోసం గట్టి పోటీ నెలకొంది.

చైర్మన్ పదవి దక్కించుకోవడానికి  ఆశావహులు కసరత్తు చేస్తున్నారు..తమకే చైర్మన్ పదవి రావాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విందులతో నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పర్యటనలు ఎక్కడ ఉంటే అక్కడకి వెళ్లి ప్రత్యక్షమవుతున్నారు.ఎమ్మెల్యే దృష్టిలో పడాలని తంటాలు పడుతున్నారు.ఇప్పటికే తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ పదవి కోసం నలుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటా పోటీగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఎలాగైనా చైర్మన్ పదవి తనకే రావాలని తీవ్రంగా కృషి  చేస్తున్నారు.మండలంలోని ఏండ్రియాల్ గ్రామానికి చెందిన సంతాజి గారి సుధాకర్ రావు చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.ఇప్పటికే ఆయన పలుమార్లు ఎమ్మెల్యేను కలిసి చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు,నాయకులతో కలిసి చైర్మన్ పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు.

కృష్ణాజివాడి గ్రామానికి చెందిన షేర్ బద్దం రమణారెడ్డి చైర్మన్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.వ్యవసాయ రంగంలో తనకు మంచి అనుభవం ఉందని ఎలాగైనా చైర్మన్ పదవి తనకే కట్టబెట్టాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు.దేవాయిపల్లి గ్రామానికి చెందిన మరో నాయకుడు వెంకట్ రెడ్డి చైర్మన్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.గతంలో తాను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగానని నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, తనకే ఎలాగైనా పదవి దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

తాడ్వాయి కి చెందిన మరో నాయకుడు రాజేశ్వర్ రెడ్డి చైర్మన్ పదవి కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా, నాయకుడిగా పని చేశానని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశానని ఎలాగైనా తనకే పదవి ఇవ్వాలని గట్టిగానే వాదిస్తున్నారు.ఏది ఏమైనా చైర్మన్ పదవికి గట్టి పోటీ ఉండడంతో ఎమ్మెల్యే నాయకులతో, కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.ఎవరికి ఇవ్వాలనే కసరత్తు చేస్తున్నారని నాయకులు చెబుతు న్నారు. దాదాపుగా ఈ వారంలో పదవి కట్టబెట్టే  అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.చైర్మన్ పదవి ప్రకటిస్తే ఆశావాహుల్లో అలజడి పోతుందని స్థానిక నాయకులు వాపోతున్నారు.

దేమికలాన్ సింగిల్ విండోకు గట్టి పోటీ..

తాడ్వాయి మండలంలోని మరో సింగిల్ విండో దేమికలాన్ కు సైతం గట్టి పోటీ నెలకొంది.దేమికలాన్ సింగిల్ విండో పరిధిలో దేమి కలాన్ కన్కల్, కరడ్ పల్లి గ్రామాలు ఉన్నాయి ప్రస్తుతం దేమికలాన్ కు చెందిన కాటిపల్లి రాజ సింగిల్ విండో చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు.ఈ పదవి తిరిగి దేమికలాన్ కు రాదని తెలియడంతో గ్రామానికి చెందిన నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు.

కన్కల్ కరడ్ పల్లి గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు గట్టిగానే పోటీ పడుతున్నారు. కన్కల్ గ్రామానికి చెందిన గడ్డం ప్రతాపరెడ్డి తనకే చైర్మన్ పదవిదక్కాలని ఆశిస్తున్నారు.గతంలో సర్పంచ్ గా కొనసాగానని తనకు మంచి అనుభవం ఉందని పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు. అదే గ్రామానికి చెందిన మరో నాయకుడు భూపతిరెడ్డి సైతం చైర్మన్ పదవి తనకే కట్టబెట్టాలని పోటీపడుతున్నారు.

కరడ్పల్లి గ్రామానికి చెందిన మరో మాజీ సర్పంచ్ మురళీమోహన్ చైర్మన్ పదవి కోసం కసరత్తు చేస్తున్నారు. తాను గతంలో సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించానని తాను సీనియర్ నాయకుడిని అయినందున చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నాయకులతో కలిసి ఎమ్మెల్యేతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. మండలంలో రెండు చైర్మన్ పదవులకు గట్టిగానే పోటీ ఉండడంతో ఎవరిని పదవులు వరిస్తాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.