calender_icon.png 23 February, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులమేమిటి..మతమేమిటి ?

23-02-2026 02:24:21 AM

మానవత్వం మంటగలిసె..

మానవత్వంపై మాయని మచ్చ.. మేడారం కోవా బన్ వివాదం

  1. సామాన్యుడిపై ‘తేజస్వీ న్యూస్’ చానల్ పైశాచికం
  2. చిరు వ్యాపారి షేక్ షా వలీపై ‘ఫుడ్ జిహాద్’ ఆరోపణలు
  3. మూకదాడిలో లక్ష విలువైన కోవా, బన్నులు ధ్వంసం
  4. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం
  5. తాజాగా గుండెపోటుతో మృతిచెందిన పాల సప్లయర్ బాషా
  6. రెస్టారెంట్ యాజమాన్యాలు రూ.౭౦ వేల కోట్ల జీఎస్టీ ఎగవేత
  7. ఫుడ్ నాణ్యత, కుంభకోణంపై నోరు మెదపని చానెళ్లు

సమాజంలో మానవత్వం మంటగలిసిపోతున్నది. కొందరి మత విద్వేషాలు చిరువ్యాపారుల పాలిట మరణశాసనాలుగా మారుతున్నాయి. పొట్టకూటి కోసం మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్న షేక్ షా వలీ అనే సామాన్యుడిని ‘తేజస్వీ న్యూస్’ అనే యూట్యూబ్ చానెల్ ప్రతినిధులు వెంటాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కోవా బన్ వ్యాపారాన్ని ‘ఫుడ్ జిహాద్’ అంటూ మత రంగు పులిమారు.

అతని వ్యాపారంపై కల్తీ ముద్ర వేశారు. తద్వారా ఆ చిరు వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఆ కుటుంబాన్ని కుంగదీశారు. ఈ వివాదం అక్కడితో ఆగలేదు. ఆ ప్రభావం పాల సప్లయర్‌పైనా పడింది. తన వ్యాపారంపై కల్తీ ముద్రపడి నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన పాల సప్లయర్ షేక్ బాషా ఇటీవల గుండెపోటుతో మరణించాడు. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద రెస్టారెంట్ యాజమాన్యాలు రూ.70 వేల కోట్ల జీఎస్టీ కుంభకోణానికి పాల్పడ్డాయని ఐటీ, జీఎస్టీ అధికారులు గుర్తించారు.

ఏఐ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి యాజమాన్యాలు జీఎస్టీ ఎగవే శాయి. మరి.. వారు నడుపుతున్న రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను ఎవరు ప్రశ్నిస్తున్నారు? దేశ ఆదాయానికి గండికొట్టే పెద్ద వ్యాపారులను వదిలేసి, రూ.10కి ఒక బన్ అమ్మి, పేదవాడి ఆకలి తీర్చే చిరు వ్యాపారులపై చానెళ్ల ప్రతాపం ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మత విద్వేషం జడలు విప్పుతున్నది. గంగా తెహజీబ్ స్ఫూర్తితో బతుకుతున్న ప్రజల్లో కొందరు కావాలని చిచ్చుపెడుతున్నారు. ప్రతి అంశానికీ మత రంగు పులిమి రాజకీయాలు చేస్తున్నారు. అందుకు.. ఇటీవల మేడారం జాతరలో వెలుగు చూసిన కోవా బన్ ఉదంతమే నిదర్శనం. ఆ జాతర మామూలు జాతర కాదు. దక్షిణాది కుంభమేళా అది.

అలాంటి చోటికి ఎందరో చిరువ్యాపా రులు వస్తారు. తమ వద్ద ఉన్న వస్తువులు అమ్ముకుంటారు. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూ లు జిల్లాకు చెందిన షేక్ షా వలీ మేడారం వచ్చి కోవా బన్ అమ్ముతున్నాడు. జాతర జరుగుతున్న సమయంలో ఓ రోజు అతని మత ఆధారం చేసుకుని ‘తేజస్వీ న్యూస్’ యూట్యూబ్ చానల్ బృందం కోవా బండి వద్దకు వచ్చారు. ఫుడ్ జిహా ద్ పేరిట షేక్ వలీ కుట్ర పన్నుతున్నాడని ఆ బృందం వీడియో షూట్ చేయడం మొదలు పెట్టింది.

కోవా బన్ కల్తీ అంటూ ఆరోపణలు చేసింది. అతడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అక్కడితో ఆగకుండా చానల్ బృందం మరో కోవా బన్ వ్యాపారి, షా వలీ సోదరుడు షేక్ జావేద్ బండి వద్దకు వెళ్లింది. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది. వలీ, జావేద్ తాము ఎలాంటి తప్పు చేయలేదని, తాము వినియోగించే బన్‌తోపాటు కోవా తయారీకి వినియోగించే ఆహార పదార్థాలు స్వచ్ఛ మైనవని చానెల్ బృందానికి తెలిపారు.

ఎక్స్‌పైరీ అయినా పదార్థాలను వినియోగిం చలేదని, నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగిస్తామని వెల్లడించారు. అయినప్పటికీ చానెల్ బృందం వినలేదు. సదరు రిపోర్టర్లు ఒక సమయంలో షా వలీని ఒక బన్ తినమని సూచించారు. షా వలీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, నిర్భయంగా కోవా బన్ తిన్నాడు. 

అయినా.. చానెల్ వాళ్లు వదిలిపెట్టలేదు. ‘పాలు, చక్కెరతో కోవా చేస్తారు. అది ఖరీదు కదా. ఒక బన్ రూ.౧౦ కే ఎలా అమ్ముతున్నావ్’ అం టూ యక్ష ప్రశ్నలు వేశారు. అక్కడితోనూ ఆగలేదు.. ‘నీ ఆధార్ కార్డు చూపించు?’ అంటూ షా వలీని బెదిరించారు. ఈలోపు మరికొందరు వచ్చి షా వలీ కోవా బండిని ధ్వంసం చేశారు. అంతమంది ఎగబడే సరికి పాపం షా వలీ ఏం చేయగలడు. నిస్సహాయంగా నిలబడి ఉండటం తప్ప. ఇలా సదరు చానెల్ బృందం ఒక చిరువ్యాపారి ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీసిందో యావత్ సమాజం చూసింది.

రూ.10 కోవా బన్‌పై మాత్రం హడావుడి.. 

వేల కోట్ల జీఎస్టీ ఎగవేత గురించి పట్టని చానెళ్ల వారు, మేడారం జాతరలో చిన్న చిరు వ్యాపారులను టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? రాష్ట్రవ్యాప్తంగా వందలాది రెస్టారెంట్లు, హోటళ్లు ఐటీ, జీఎస్టీ శాఖలకు సరైన బిల్లులు ఇవ్వకుండా, డిజిటల్ లావాదేవీలను నమోదు చేయకుండా జీఎస్టీ ఎగ వేస్తున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. అయినప్పటికీ, రెస్టారెంట్లపై దాడులు నామమాత్రమే.

రోజంతా కష్టపడి కోవా బన్ అమ్మేవారిపై మాత్రం కొందరు కావాలని ప్రతాపం చూపడం ఎంతవరకు సమంజసం. ఆ చిరు వ్యాపారి ముస్లిం కావడంతోనే ఈ వివాదానికి మతపరమైన రంగు పులుమారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఫుడ్ జిహాద్’ వంటి పదాలను ఉపయోగించడం ద్వారా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

జాతర అనేది భక్తి, విశ్వాసం, సామరస్యానికి ప్రతీక. అలాంటి వేళ ఆహారం విక్రయించే వ్యక్తిని మతం ఆధారంగా టార్గెట్ చేయడం సమాజంలో విభజనకు దారి తీస్తుందనే ఆందోళ నలు వ్యక్తమవుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కంటెంట్ ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని చట్టాలు చెప్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది.

షేక్ భాషా మృతి.. వివాదం విషాదాంతం..

మేడారం జాతరలో కోవా బన్ వివాదం విషాదాంతానికి దారి తీసింది. మతం పేరు తో కొందరి వ్యాపారంపై కల్తీ ముద్ర వేయ డం ఓ కుటుంబ యజమానిని బలిపెట్టింది. మేడారం కోవా బన్ వివాదం తర్వాత ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన పాల సప్లయర్ షేక్ బాషా ఆందోళనకు గురయ్యాడు. అతని వ్యాపారం మందగించడం తో కుంగిపోయాడు. ఈ క్రమంలోనే బాషా ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. బాషా మృతిపై అతడి కుటుంబం స్పంది స్తూ.. ‘కోవా బన్ తయారీదారులకు మేం ఎప్పుడూ స్వచ్ఛమైన పాలనే సరఫరా చేశాం.

మేం కల్తీ పాలు ఇస్తున్నామనే ప్రచారం మా కుటుంబాన్ని కుంగదీసింది. ఫలితంగా మా ఇంటి పెద్ద కన్నుమూశాడు. జాతరలు, పండుగల సమయాల్లోనే మా వ్యాపారం బాగుంటుంది. ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తప్పుడు ఆరోపణలతో ఒక కుటుంబాన్ని ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ఆ కుటుంబ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా శిక్షించాలి? వారి కుటుం బానికి జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరిగిన రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వైద్యం,చికిత్స, మెడిసిన్ అవసరాలు.. ఇక ఎలా తీరతాయనే ప్రశ్నలు ఆయా కుటుంబాల ముందున్నాయి.

పేదరికానికి కులమేంది.. మతమేంది ?

పొట్టకూటి కోసం చిన్న వ్యాపారం చేసుకునే పేదలకు కులం ఏముంటది.. మతం ఏముంటది. పేరు అడిగి మరీ ఒక చిరువ్యాపారిని కొందరు టార్గెట్ చేసిన ఘటన మేడారంలో వెలుగుచూసింది. మతం ఆధారం చేసుకుని ఒకరి వ్యాపారిని ప్రశ్నించే హక్కు వారికి ఎవరిచ్చారు. ఆ చిరువ్యాపారి ఏ పాకిస్థాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో వచ్చిన వ్యక్తిని ప్రశ్నించినట్టు ఆ యూట్యూబ్ చానెల్ వాళ్లు ప్రశ్నించారు.

యినప్పటికీ చిరు వ్యాపారి వలీ స్వయంగా తానే కోవా బన్ తిని చూపించాడు. అంతకీ అతడు విక్రయించే కోవా బన్‌పై అనుమానాలు ఉంటే, సదరు యూట్యూబ్ చానెల్ వారు ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించవచ్చు. వారితో ఫుడ్ పరీక్షలు కూడా చేయించవచ్చు. కానీ, ఆ చానెల్‌వారు అలా చేయలేదు. రోజంతా నించుని అమ్మితే, ఆ వ్యాపారికి రూ.500 600 ఆదాయం వస్తుంది.

అలాంటి వారిని టార్గెట్ దేనికి సంకేతం. అదే వలీ మతం ఇంకేదో అయితే.. సదరు యూ ట్యూబ్ చానెల్ వారు అలాగే ప్రశ్నలు అడిగేవాళ్లా? హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి ప్రతిరోజూ చెరువులు, కాలువలు, మూసీ నదిలో కొన్ని వందల గ్యాలెన్ల వ్యర్థాలు వెలువడతాయి. సదరు యూట్యూబ్ చానెల్‌వారికి దమ్ముంటే, ఆ పరిశ్రమల యాజమాన్యాలు నిలదీయాలి. ఇంకేదైనా ప్రజాసంక్షేమం కోసం ఉపయోగపడే వీడియోలు చేయాలి. ఇలా మతపరంగా కొందరిని టార్గెట్ చేయడం మానవత్వం అనిపించుకోదు.

తెలంగాణ క్రాంతిదళ్ సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్

మా కుటుంబం కుంగిపోయింది..

మేడారం జాతరలో నేను కోవా బన్ అమ్ముతుండగా వందలాది మంది నన్ను చుట్టుముట్టారు. ఓ యూట్యూబ్ చానెల్ వారు నన్ను కోవా, బన్ నాణ్యతను ప్రశ్నించారు. కోవా బన్ తయారీకి వాడే ఆహార పదార్థాల ఎక్స్‌పైరీ డేట్ ఆడిగారు. నేను ఎక్కడి వాడినో తెలుసుకునేందుకు నా ఆధార్ కార్డు కూడా అడిగారు. నాకు అర్థం కాని ఇంగ్లిష్ భాషలో రెచ్చిపోయారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చాను.

అయినా ఆగలేదు. నన్ను కోవా బన్ తిని చూపించమన్నారు. నేను వెంటనే తిని చూపించాను. వారి చేష్టలకు నాకళ్లు చెమ్మగిల్లాయి. నాపై ఏమాత్రం కనికరం చూపలేదు. నన్ను చెట్టుకు కట్టేస్తామని బెదరించారు. నాకు ఎంతో భయమేసింది. ఆ ఘటన మా కుటుంబాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. మా కుటుంబం కుమిలిపోయింది. చిన్నబోయింది. ఇకపై మేం వ్యాపారం చేస్తామో లేదోనన్న భయం మమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతున్నది. యూట్యూబ్ చానెల్ వారి దాడిలో సుమారు రూ.లక్ష విలువైన కోవా, బన్నులు దెబ్బతిన్నాయి. బండి పెట్రోల్ ఖర్చులైనా రాలేదు.

 షా వలీ, బాధితుడు 

రూ.7౦ వేల జీఎస్టీ స్కాం.. అయినా ఎవరూ ప్రశ్నించరు..

దేశవ్యాప్తంగా ఇప్పుడు రూ.౭౦ వేల కోట్ల జీఎస్టీ స్కాం సంచలనం సృష్టిస్తున్నది. జీఎస్టీ ఎగవేసేందుకు రెస్టారెంట్‌యాజమాన్యాలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి, ఏఐని వాడి వేలాది కోట్ల జీఎస్టీ ఎగవేశాయి. తాజాగా హైదరాబాద్‌తోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.౧,౫౦౦ కోట్ల కుంభకోణం జరిగింది. దీన్నిబట్టి హైదరాబాద్ బిర్యానీ వెనుక ఎంతటి చీకటి కోణం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా రెండు రాష్ట్రాల్లోనే సుమారు రూ.5,100 కోట్ల విలువైన కుంభకుణం జరిగింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని లొట్టలేసుకుంటూ బిర్యానీలు, ఫాస్ట్‌ఫుడ్ తినే సంస్కృతి వచ్చేసింది. ఆయా రెసిపీల తయారీకి యాజమాన్యాలు ఏయేం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని ఎవరైనా అడిగారా? ఆ ఆహార పదార్థాల ఎక్స్‌పైరీ డేట్ ఏంటని ఎవరైనా ప్రశ్నించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హైదరాబాద్‌లో కేవలం 40 హోటళ్లను తనిఖీ చేస్తేనే, ఇంత మొత్తంలో కుంభకోణం బయటపడితే, ఇక మొత్తం రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తే ఇంకెత్తమొత్తంలో కుంభకోణం బయపడుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి సదరు యూట్యూబ్ చానెళ్ల వారికి ఆ సోయి ఎందుకు లేదనే విషయం తెరమీదకు వచ్చింది.

మరో జాతరకు వెళ్లేందుకు భయపడుతున్నాం

మేడారం ఘటన మా రెండు కుటుంబాలను కుంగదీసింది. మాపై లేనిపోని అబాండాలు వేయడంతో మేం వివక్షను ఎదుర్కొన్నాం. ఆ ఆరోపణలను ఆసరా చేసుకుని కొందరు తాగుబోతులు, విద్వేషకులు మా గ్రామంలో విష ప్రచారం చేశారు. మేం అమ్మే కోవా బన్‌పై కల్తీ ముద్ర వేశారు. ఇప్పుడు మా కుటుంబం బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బండి పడుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జాతరకు వెళ్లి కోవా అమ్మాలంటే భయపడాల్సిన పరిస్థితి. మళ్లీ అలాంటి ఘటనే జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నాం. మా వ్యాపారంలో ఎలాంటి కల్తీ లేదు. మేం కోవా తయారీకి స్వచ్ఛమైన గేదె పాలు వినియోగిస్తాం. ఆ పాలు కూడా ప్యాకెట్ పాలు కాదు. మా ఊరిలో మేం కొందరి నుంచి గేదె పాలు తీసుకుంటాం. అలాగే చక్కెర, బొంబాయ్ రవ్వ వాడతాం. కొన్ని గంటలపాటు కష్టపడి కట్టెల పొయ్యిపైనే కోవా తయారు చేస్తాం. మా కుటుంబం ౮౦ ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నది. మాపై కల్తీ ముద్ర వేయడం కలచివేసింది.

 జావేద్, మరో బాధితుడు

ప్రజాప్రతినిధులు, మంత్రుల మద్దతు

కోవా బన్ వివాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. మం త్రి లోకేశ్ అయితే.. ‘వలీ మీ ఇంటికి వస్తా.. కోవా బన్ తింటా’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ సైతం పెట్టారు. ఆయన సందేశాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు స్వాగతించారు. అభినందించారు. అలాగే ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు కూడా కోవా బన్ వివాదంపై స్పందించారు. షా వలీ వద్దకు వెళ్లి పరామర్శించారు.

ఆ కుటుంబానికి రూ.౨౫,౦౦౦ ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ.. కేవలం లైకుల కోసం చిన్న వ్యాపారిని ఇబ్బంది పెట్టడం సరికాదని యూట్యూబ్ చానెళ్లపై మండిపడ్డారు. ఆహార నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారు లున్నారని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని సూచించారు. ఏపీ మంత్రి కే అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఆకలికి కులం లేదని, ఆత్మగౌరవానికి మతం లేదని, కేవలం సోషల్ మీడియా వ్యూస్ కోసం ఒక సామాన్యుడిని అవమానించడం అమానవీయమని మండిపడ్డారు.

మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పందించి షా వలీకి స్వయంగా ఆర్థిక సాయం అందించారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. కేవలం మతపరంగా టార్గెట్ చేస్తూ, చిరు వ్యాపారి షా వలీని ఇబ్బంది పెట్టిన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ శుబ్లీ వ్యాపారి వలీని కలిసి రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. 

బాధితులకు పెద్ద ఎత్తున మద్దతు

షేక్ షా వలీని తేజస్వీ చానెల్ బృందం వేధించిన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో వలీ నిస్సహాయతను చూసి ఎంతోమంది కంటనీరు పెట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అలా మద్దతు ఇచ్చిన వారిలో సాధారణ ప్రజల నుంచి మేధావులు, సినీ స్టార్లు, ఉద్యమకారులూ ఉన్నారు. పెద్ద పెద్ద ఫుడ్ ఫ్రాంచైస్‌లో వందలకు వందలు రేటు పెట్టి, పిజ్జాలు, బర్గర్లు అమ్ముతుంటే, అక్కడ లభించే ఆహార పదార్థాల నాణ్యతను ఎవరైనా ప్రశ్నించారా..?

అంటూ ప్రశ్నిస్తున్నారు. డిస్కౌంట్లు, ఆఫర్లంటూ ఊరించి, సొమ్ము చేసుకుంటుంటే ఎవరూ నిలదీయరంటూ వాపోతున్నారు. ఆహార నాణ్యతపై సందేహాలుంటే, ఎవరికి అభ్యంతరం ఉంటే వారు ఫుడ్ సేఫ్టీ అథారిటీని సంప్రదించాలే కానీ, ఒక పేద వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేంటని మండిపడుతున్నారు. ఇది ఒక వైపు అయితే మరోవైపు షేక్ షా వలీ చిరునామా వివరాలు తెలుసుకుని మరీ ఆయన ఇంటికి వెళ్తున్నారు.

ఈ జాబితాలో యూట్యూబర్లు, ఎందరో ఉద్యమకారులు కూడా ఉన్నారు. వలీ సొంతూరుకు చెందిన ఎంతోమంది కూడా ఆ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు వలీ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశారు. 

కోవా బన్ వివాదం.. విషాదాంతం

కోవా బన్ వివాదం చివరకు విషాదాంతంగా ముగిసింది. షేక్ షా వలీపై పడిన కల్తీ ముద్ర పాల సప్లయర్లపైనా పడింది. ఈ మానసిక వేదనతో తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కోవా బన్ వ్యాపారి, పాల సప్లయర్ షేక్ బాషా గుండెపోటుతో మరణించాడు. బాషా ఇటీవల అప్పులు చేసి గేదెలు కొన్నాడు.

సుహానా- పేరుతో మిల్క్ డెయిరీ ప్రారంభించాడు. పాల సరఫరాకు ఓ ఆటో సైతం తీసుకున్నాడు. కానీ  మతపరంగా టార్గెట్ చేసి, కోవా బన్ వ్యాపారులను కొందరు వేధించడం ఆ కుటుంబానికి శాపమైంది. చివరకు గుండెపోటుకు గురై బాషా ప్రాణాలు విడిచాడు.