ప్రపంచ ఫ్యూచర్ సిటీ
- బంగారం కంటే రంగారెడ్డిలో భూముల ధరలే ఎక్కువ
- టోక్యో, న్యూయార్క్, సింగపూర్ తరహాలో అభివృద్ధి
- కేవలం 150 రోజుల్లోనే తొలి ‘నెట్ జీరో’ భవనం పూర్తి
- అభివృద్ధిని అడ్డుకుంటే బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
- ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిపాలనా భవన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి/కందుకూరు, జూన్ 10 (విజయక్రాంతి): ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని, ఫ్యూ చర్ సిటీ కేవలం మన కోసం మాత్రమే కాదు మొత్తం ప్రపంచం కోసం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ‘ ప్రాజెక్టులో ఒక కీలక అడు గుపడింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని బేగరి కంచెలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిపాలనా భవనాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ భవనం ఫ్యూచర్ సిటీలోనే తొలి ‘నెట్ జీరో’ (కాలుష్య రహిత) నమూనా భవనంగా నిల వడం విశేషం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యూచర్ సిటీ కేవలం మన కోసం మాత్రమే కాదు. మొత్తం ప్రపంచం కోసం’ అని ప్రకటించారు. కుతుబ్‌షాహీల నుంచి నిజాం నవాబుల వరకు హైదరాబాద్ విస్తరణకు పునాదులు వేశారని, ఆనాటి పాలకుల దూరదృష్టి వల్లే నేడు సైబరాబాద్ సాంకేతిక విప్లవాన్ని సృష్టించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయంలో 60 శాతం నిధులు సైబరాబాద్ నుంచే వస్తున్నాయని, అక్కడ ఎకరం భూమి ధర రూ.200 కోట్లకు పైగా పలుకుతోందని చెప్పారు.
బంగారం ధర కంటే రంగారెడ్డిలోని భూముల ధరలే ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. రాబోయే ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని జపాన్‌లోని టోక్యో, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ తరహాలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఈ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు
తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘బీఆర్‌ఎస్ నేతలు రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటులాంటివారు. మీకు గతమే ఉంది కానీ భవి ష్యత్తు లేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే తిరస్కరించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు’ అని హెచ్చరించారు.
గతంలో హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్, జీనోమ్ వ్యాలీని అడ్డుకోవాలని చూసినట్లే ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 150 రోజుల్లోనే ఈ భవనాన్ని నిర్మించి చూపించడం తమ ప్రభుత్వ వేగానికి నిదర్శనమన్నారు.
లేక్ ఎకానమీ.. పెట్టుబడుల హబ్
గత పాలకుల నిర్వాకం వల్ల హైదరాబాద్‌లో చెరువులు కబ్జాకు గురై, రెండు గంటల వర్షానికే నగరం జలమయమవుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభు త్వం కబ్జాదారుల కోరలు పీకుతూ నల్లచెరువు, తుమ్మడి చెరువు, బతుకమ్మ కుంట వంటి చారిత్రాత్మక చెరువులను పునరుద్ధరిస్తోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, ఏఐ గ్లోబల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలతో పాటు గ్రీన్ ఫార్మా, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కొలువుదీరనున్నాయని చెప్పారు.
ఇప్పటికే 500 కంపెనీలకు పునాది వేశామని సీఎం తెలిపారు. రాబోయే డిసెంబరులో మరిన్ని పెట్టుబడుల కోసం ప్రపంచ స్థాయి సంస్థలతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని ప్రకటించారు. అంతకుముందు సీఎం ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో తన ఛాంబర్‌లో ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డును అందజేశారు.
దేశానికి దిక్సూచి ఫ్యూచర్ సిటీ: భట్టి
భారతదేశానికి దిక్సూచి ఫ్యూచర్ సిటీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీఆర్‌ఎస్ ఓర్వడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ విషం చిమ్ము తోంది అని మండిపడ్డారు.






