11 June, 2026 | 3:06 AM

భారతీయ దర్శక శిఖరం

11-06-2026 02:16 AM

సినీ దిగ్గజం భారతీరాజా కన్నుమూత

* భారతీయ సినీ దిగ్గజం, తమిళ దర్శకుడు భారతీరాజా (84) బుధవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సినిమాను పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి వాసనల్లోకి నడిపించిన ఘనత ఆయనది. రియలిజం అనే సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం చేసిన  సృజనాత్మక దర్శకుడు ఆయన. కొత్తతరం దర్శకులకు ఆయన ఒక పాఠ్యపుస్తకం.

భారతీరాజా : (1942-2026)

* గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చిన దర్శక ఇంద్రుడు భారతీరాజా. భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తమిళ, తెలుగు సినిమా పరిశ్రమలకు సరికొత్త నడకను, నడతను నేర్పిన దర్శకుడు ఆయన. కేవలం స్టూడియో సెట్టింగుల మధ్య, కృత్రిమ కాంతుల వెలుతురులో సాగుతున్న నాటి సినిమాని.. పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి వాసనల్లోకి నడిపించిన ఘనత ఆయనది. కమర్షియల్ హంగుల నడుమ రియలిజం అనే సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఈ సృజనాత్మక దర్శకుడి ప్రయాణం ఈతరం దర్శకులకు ఒక పాఠ్యపుస్తకం.  

ప్రముఖ సినీ దిగ్గజం, తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భారతీరాజా మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ సినీ ప్రముఖు లు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డీ సురేశ్‌బాబు, గౌరవ కార్యదర్శి కే అశోక్‌కుమార్, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరఫున అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పీవీ రామారావు, కోశాధికారి నీలం సాయిరాజేశ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల జేవీ ప్రసాద్‌రావు, కార్యదర్శి సురేశ్ కొండేటి సంతాపం తెలిపారు.

* మట్టివాసనను వెండితెరపైకి తెచ్చిన దర్శకుడిగా భారతీరాజాకు పేరుంది. దీని వెనుక కారణాన్ని ఆయన ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు. “నేను ఒకమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటా. ఆశ్చర్యంగా ప్రతిసారీ ఆమె నాకు పల్లెల్లోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా” అంటూ పల్లెలపై తన ప్రేమను వ్యక్తపర్చారు. 

భారతీరాజా పార్థివదేహానికి తమిళనాడు సీఎం విజయ్ నివాళులు 

తమిళనాడు సీఎం విజయ్ అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. భారతీరాజా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సంతాపం తెలిపారు. డీఎంకే అధినేత స్టాలిన్, సినీ నటి రాధిక కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

తమిళ సినిమా పంథాను మార్చి, కొత్త ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటన్నారు. ఆయన చిత్రాలు భారతీ య చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన ఎన్నోతరాలకు స్ఫూర్తి అని గుర్తుచేసుకున్నారు. 

భారతీయ సినిమాను మలుపు తిప్పిన మేకింగ్ స్టుల్

భారతీరాజాను కేవలం ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అని చెబితే సరిపోదు. ఆయనొక ట్రెండ్ సెట్టర్. సినిమా మేకింగ్ విధానంలో ఆయన చేసిన ప్రయోగాలు భారతీయ సినిమాను మలుపు తిప్పాయి. కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్, పీ పుల్లయ్య, కేఎస్ గోపాలకృష్ణన్ వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు భారతీరాజా. తమిళ ఇండస్ట్రీ ‘ఇయక్కునార్ ఇమయం’ (దర్శకత్వ శిఖరం)గా పిలుచుకునే స్థాయికి ఎదిగారు.

భారతీరాజా రాకముందు వరకు సినిమాలంటే ఎక్కువ భాగం స్టూడియో సెట్లలోనే షూటింగ్ జరుపుకునేవి. కానీ, ఆ పద్ధతిని పూర్తిగా బద్దలు కొడుతూ.. కెమెరాను పల్లెటూరి వీధుల్లోకి, చెరువు గట్ల మీదకు తీసుకెళ్లారు భారతీరాజా. సహజమైన గాలి, వెలుతురు, నిజమైన పల్లెటూరి మనుషుల నడుమ సినిమా తీసి సహజత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆయన సినిమాల్లో కెమెరా కదలికలు చాలా వైవిధ్యంగా ఉండేవి.

ముఖ్యంగా ఇళయరాజాతో ఆయనకు ఉన్న అనుబంధం అద్భుతమైన సంగీతాన్ని అందించింది. పల్లెటూరి జానపద బాణీలను, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో సరికొత్త ప్రయోగాలు చేశారు. పాటల చిత్రీకరణలో ప్రకృతిని ఒక పాత్రగా వాడుకోవడం ఆయన ప్రత్యేకత. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొబగుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో అప్పటి సినీ సంప్రదాయాలను తిరగరాశారు. 

బలమైన సామాజిక కథాంశాలు.. 

ప్రేమకథలనే కాకుండా సమాజంలోని రుగ్మతలపై ఆయన కెమెరాతో యుద్ధం చేశారు. కుల వ్యవస్థలోని అరాచకాలను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ ఆయన తీసిన ‘వేదం పుదిదు’ చిత్రం సంచలనం సృష్టించింది. పల్లెల్లో జరిగే ఆడశిశు హత్యాకాండ నేపథ్యంగా వచ్చిన ‘కరుత్తమ్మ’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. 

బహుముఖ ప్రజ్ఞతో మెప్పించి.. 

ప్రేక్షకులకు మర్చిపోలేని క్లాసిక్స్‌ను అందించారు భారతీరాజా. తొలుత గ్రామీణ చిత్రాలతో అలరించిన ఆయన ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ‘ఎర్ర గులాబీలు’) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. మేకింగ్‌పరంగా ప్రతి చిత్రంపైనా తనదైన ముద్ర వేసే భారతీరాజా కెరీర్‌లో ‘సీతాకోక చిలుక’లోని షాట్ ఎంతో ప్రత్యేకం. ట్రాలీ షాట్స్ ఎప్పటి నుంచో ఉన్నా, రౌండ్ ట్రాలీ అనేది తర్వాత వచ్చింది.

అది లేని రోజుల్లోనే భారతీరాజా తీసిన షాట్ ఒకటి ప్రత్యేకం. నాయకానాయికలు తమ పేర్లు ఉన్న చెట్టు దగ్గర కలిసే షాట్ తీసేటప్పుడు.. దుప్పటిపై కెమెరామెన్‌ను పడుకోబెట్టి, నలుగురు బలమైన వ్యక్తులతో అతడినిపైకి లేపి, హీరో, హీరోయిన్ చుట్టూ తిరుగుతూ షాట్ తీయించారు. ఇలాంటి ప్రయోగాలు భారతీరాజా కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి.

భావి చిత్రనిర్మాతలకు శిక్షణ ఇవ్వడానికి ‘భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ సినిమా’ (బీఆర్‌ఐఐసీ)ని స్థాపించారు. భారతీరాజా నటుడిగానూ అలరించారు. ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. నటుడిగా ఆయనకు చివరి సినిమా ‘పులవర్’. ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.  

భారతీరాజా.. ఓ ‘నటుల ఫ్యాక్టరీ’ 

భారతీరాజాను ‘నటుల ఫ్యాక్టరీ’ అని పిలవవచ్చు. నేడు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఎంతో మంది స్టార్లను పరిచయం చేసింది ఆయనే. శ్రీదేవి, కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి వారికి నటులుగా జీవితాన్నిచ్చిన చిత్రాలు ఆయన తీసినవే. అలాగే రాధిక, రాధ, రేవతి, విజయశాంతి, కాజల్ కిరణ్ వంటి నాయికలను, కార్తీక్, సుధాకర్ వంటి నాయకులను వెండితెరకు పరిచయం చేసిన పారదర్శక దర్శకుడు ఆయన. 

‘ఇయక్కునార్ ఇమయం బిరుదాంకితుడు 

భారతీరాజా ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి, ‘ఇయక్కునార్ ఇమయం (దర్శక శిఖరం)’ అనే బిరుదును పొందారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. తెలుగు చిత్రం ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు దక్కింది.

2004లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. దక్షిణ భారత సినిమా రంగం నుండి ఎన్నో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందుకున్నారు. 

తెలుగునాట ముద్ర.. 

తమిళంలో అద్భుత సినిమాలు తీసిన భారతీరాజా.. తెలుగులోనూ తనదైన ముద్ర వేశారు. ‘కొత్త జీవితాలు’ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచమైన ఆయన.. సుహాసినిని మన చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘సీతాకోక చిలుక’ ఎవర్‌గ్రీన్. మాస్ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ‘ఆరాధన’ తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు. తమిళంలో భారతీరాజా తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయి, హిట్ కొట్టాయి.

‘16 వయతినిలే’ తెలుగులో ‘పదహారేళ్ల వయసు’గా, ‘సిగప్పు రోజక్కల్’ ‘ఎర్ర గులాబీలు’గా, ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’గా, ‘ముదల్ మారియాదై’ తెలుగులో ‘ఆత్మబంధువు’గా, ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో ‘మంగమ్మ గారి మనవడు’గా అనువాదమై ప్రేక్షకాదరణ పొం దాయి. ‘ఒరు ఖైదియన్ డైరీ’ తెలుగులో ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించింది.

ఇదే కథను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘ఆఖరీ రాస్తా’గా తీసి, విజయం సాధించారు. 80వ దశకంలో సినీ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన చిత్రాల్లో ‘సీతాకోక చిలుక’ ప్రేమకు సరికొత్త నిర్వచనాన్నిచ్చింది. సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.

సినీ ప్రముఖుల సంతాపం

చిత్రరంగానికి తీరని లోటు

భారతీరాజా నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్రరంగంలో తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగా, నటుడిగా భారతీరాజా విశేషఖ్యాతి గడించారు. వైవిధ్యమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించారు. భారతీయ చలనచిత్రరంగానికి విశిష్ట సేవలందించారు. ఆయన మరణం చిత్రరంగానికి తీరని లోటు. 

 రేవంత్‌రెడ్డి, తెలంగాణ సీఎం 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి 

భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించా. తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీరాజా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.  

 పవన్‌కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం 

ఆయన అంకితభావం నాకు స్ఫూరి: చిరంజీవి  

భారతీయ సినిమా రంగం ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి పరిమ ళాన్ని, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను సినిమాగా మలచి మనకు అందించారు భారతీరాజా. ఆయన చిత్రాలు కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయాయి. ‘ఆరాధన’ చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావం నాలోనూ స్ఫూర్తి నింపింది. ఆయన మన మధ్య లేకపోయినా తన గొప్ప చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.  -  

భారతీయ సినిమాకు తీరని లోటు: కే రాఘవేంద్రరావు

ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణం భారతీయ సినిమాకు తీరని లోటు.  

విప్లవం సృష్టించిన మార్గదర్శి: ఎస్‌ఎస్ రాజమౌళి 

సహజంగా, ఎక్కడా రాజీపడకుండా సినిమా కథను చెప్పే విషయంలో ఒక విప్లవం సృష్టించిన మార్గదర్శి భారతీరాజా. సినీ ఇండస్ట్రీ ఆయన అసాధారణ కృషి, పనితీరును స్మరించుకోవడం గొప్ప గౌరవం. 

నిశ్శబ్దంలో సత్యాన్ని చూపిన దర్శకుడు: మోహన్‌లాల్  

నిశ్శబ్దంలో సత్యాన్ని చూపిన దర్శకుడు భారతీరాజా.  తుడరుమ్’ చిత్రంలో ఆయనతో స్క్రీన్ పంచుకోవడం ఎప్పటికీ పదిలపరుచుకునే గౌరవం.  ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

భారతీరాజా సర్.. ధన్యవాదాలు: ప్రకాశ్‌రాజ్  

భారతీరాజా సర్.. మీరు లేని లోటు తీర్చలేనిది. మాపై మీరు చూపిన ప్రేమకి, మాలో మీరు నింపిన స్ఫూర్తికి, ఎన్నో గొప్ప సినిమాలను అందించినందుకు.. అన్నింటికీ ధన్యవాదాలు. 

సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి: అల్లు అర్జున్  

భారతీరాజా మరణం తీవ్ర విచారకరం. ఆయన ఓ దిగ్గజం, ఆయన దార్శనికత, కథ చెప్పే విధానంతో పాటు భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నేటి దర్శకులు, నటులకే కాదు, రాబోయే తరాలకు ఆయన సినిమాలు స్ఫూర్తి.  

గొప్ప వారసత్వాన్ని వదిలివెళ్లారు: ఖుష్బూ  

మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు భారతీరాజా ఇక మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. భవిష్యత్తులో రానున్న సినిమాలకు ఆయన చిత్రాలు ఓ నిఘంటువులా ఉంటాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక సినిమా చేద్దామని ఆయన ఎప్పుడూ అనేవారు. ఆ కల ఇక తీరని కలగానే మిగిలిపోయింది. 

అది భారతీరాజా భిక్షే: అలీ 

గొప్పగొప్ప నటులను దర్శకత్వం వహించిన వ్యక్తి భారతీరాజా. ‘సీతాకోక చిలుక’ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు మంచి నటీనటులను పరిచయం చేశారు. దర్శకుడు లేనిదే నటులు లేరు. కథ, అందులోని పాత్రలకు ఎవరి సరిపోతారో గొప్పగా అంచనా వేయగల వ్యక్తి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో మంచి షాట్స్ తీశారు. ‘సీతాకోక చిలుక’ నా ఏడో సినిమా. కొంచెం హుషారుగా ఉండే పిల్లాడు కావాలనగానే నాకు కాల్ వచ్చింది. వెళ్లిన అరగంటకే ఆ పాత్రకు నన్ను ఓకే చేశారు. ‘సీతాకోక చిలుక’ పాటలు ఎప్పుడు విన్నా హృద్యంగా అనిపిస్తాయి. ఒక నటుడిగా నేను ఇన్ని సినిమాలు చేశానంటే అది భారతీరాజా  పెట్టిన భిక్షే.  

గురువుతో సమానం : ముచ్చర్ల అరుణ, నటి 

భారతీరాజా మరణం తీరనిలోటని నటి ముచ్చర్ల అరుణ అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియో విడుదల చేశారు. తనకు నటిగా గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం భారతీరాజానే అని అరుణ భావోద్వేగానికి గురయ్యారు. భారతీ రాజా తనకు గురువుతో సమానమన్నారు.