అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి
అర్బన్ బ్యాంక్ పి.ఐ.సి చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి
కరీంనగర్, జూలై 21 (విజయ క్రాంతి): జిల్లా మంత్రుల పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ వేలుచాలా రాజేంద్ర రావు బ్యాంక్ అభివృద్ధికి మా కమిటీ కృషి చేస్తుందని కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పి ఐ సి చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో, సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా కమిటీని ప్రభుత్వ జీవో ద్వారా నియమించారని తెలిపారు. తదుపరి ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం వల్ల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్నికలకు వెళ్లడం జరిగిందని, ఆ ఎన్నికల్లో రాజశేఖర్ ప్యానల్ గెలిచిందని పేర్కొన్నారు.
ఆ ఎన్నికలు సక్రమంగా జరగలేదని బ్యాంక్ బైలా ప్రకారం, 1964 సహకార చట్టం ప్రకారం జరగలేదని వరంగల్ సహకార ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం జరిగిందని, సహకార ట్రిబ్యునల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి ఎన్నికైన కమిటీ పై స్టేఇచ్చి వివాదాస్పద ఎన్నికలకు ముందున్న నా పిఎసి కమిటీని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 7న మా కమిటీ బాధ్యతలు స్వీకరించామని, బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మడుపు మోహన్, లక్ష్మణ్ రాజు, అలుగు విద్యాసాగర్, ముక్క భాస్కర్, సందీప్, నాగుల సతీష్, మార్కారాజు పాల్గొన్నారు.






