20 August, 2026 | 10:06 PM

Breaking News

పేదోళ్లకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే

20-08-2026 09:37 PM

- గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం బీర్ల కంపెనీలకే పోయింది

- అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు అందజేస్తాం

- రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి  ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట,(విజయక్రాంతి): రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి  ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు.

తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పౌరసరఫరాల శాఖను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని దాదాపు 80 నుండి 90 శాతం మంది ప్రజలు తినలేకపోయేవారని, ఆ బియ్యాన్ని కేవలం ఐదు, పది రూపాయలకే అమ్ముకోవడం లేదా రీసైక్లింగ్ చేసి బీర్ల కంపెనీలకు, కోళ్ల ఫారాలకు తరలించేవారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఈ దుస్థితిని మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.

దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 42 లక్షల మంది పేదలు లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకువచ్చిందని, తద్వారా లబ్ధిదారుల సంఖ్యను పెంచామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు.

రైతులకు సకాలంలో రూ. 90 వేల కోట్లు

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. ఈ రెండున్నరేళ్ల పాలనా కాలంలో రైతుల నుంచి రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 90 వేల కోట్లను జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తనూ, తన సతీమణి పద్మావతి ఎల్లప్పుడూ జిల్లా ప్రజల సేవలో అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.

తదుపరి సర్వీస్ లో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక  పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి,  తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే నరసింహ, అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డి సి ఓ మోహన్ బాబు, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రూ.3.80 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన:

 సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రూ.3.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భారీ నిధులతో మార్కెట్‌లో రైతులకు సౌకర్యార్థం గాల్‌వాల్యూమ్ షెడ్ల నిర్మాణం, పీవీ పవర్ ప్లాంట్, మరియు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అలాగే, సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధికి అదనంగా రూ.95 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నూతనంగా మామిడి మార్కెట్ ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్‌ను ఆయన ఆదేశించారు.మార్కెట్‌కు వచ్చే రైతులకు ఉచితంగా అల్పాహారం అందించడంతో పాటు కేవలం రూ.5 లకే నాణ్యమైన మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించడం ఎంతో అభినందనీయమని, ఈ ఉత్తమ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమలు చేసేలా మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు.