20 August, 2026 | 11:06 PM

అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

20-08-2026 09:54 PM

మహబూబ్‌నగర్ క్రైం: అత్యాచారం కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ మహబూబ్‌నగర్ 4వ అదనపు సెషన్స్ కోర్టు, మహిళా కోర్టు న్యాయమూర్తి ఆఫ్రోజ్ అక్తర్ గురువారం తీర్పు వెలువరించారు. 2023లో అడ్డాకల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడ్డాకల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన మద్దా కరుణాకర్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నట్లు కేసు నమోదైంది.

అనంతరం బాధితురాలు పెళ్లి చేసుకోవాలని కోరగా నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2023 ఏప్రిల్ 11న అప్పటి అడ్డాకల్ ఎస్‌ఐ జి. విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి భూత్పూర్ సీఐ రజితారెడ్డి పర్యవేక్షణలో, ప్రస్తుతం అడ్డాకల్ ఎస్‌ఐగా పనిచేస్తున్న మురళి, ప్రస్తుతం భూత్పూర్ సీఐగా ఉన్న రామకృష్ణ తదితరులు దర్యాప్తును కొనసాగించారు. కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెనూ శ్రీ ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

కోర్టు డ్యూటీ అధికారి మహిపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, కోర్టు లైజన్ అధికారి విజయ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ హెచ్‌జీఓ రమేష్ తదితరులు కీలకంగా వ్యవహరించారు. పోలీసుల సమర్థ దర్యాప్తు, పటిష్ట ఆధారాల సమర్పణ, ప్రాసిక్యూషన్ వాదనల ఫలితంగా నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెనూ శ్రీలను జిల్లా ఎస్పీ  డి. జానకి, ఐపీఎస్ అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు, కోర్టు ప్రాసిక్యూషన్ ప్రక్రియను మరింత పటిష్టంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.