పెద్దతండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు
అక్కన్నపేట,(విజయక్రాంతి): పెద్దతండ గ్రామంలో గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు తీజ్ బుట్టలను తలపై పెట్టుకుని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సవాల్లో సందడి చేశారు. బంజారా గిరిజనుల సంప్రదాయ సంస్కృతిలో తీజ్ ఉత్సవానికి ప్రత్యేక స్థానం ఉంది. పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుతూ మహిళలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తీజ్‌లో భాగంగా గోధుమ విత్తనాలను బుట్టల్లో పెంచి, వాటిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు.
అనంతరం మహిళలు సామూహికంగా తీజ్ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు మాట్లాడుతూ.. తీజ్ పండుగ తమ పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సాంస్కృతిక సంప్రదాయమని, భావితరాలకు కూడా ఈ ఆచారాలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉత్సవాల్లో గ్రామ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో గ్రామస్తుడైన కోహెడ ఏ ఎస్ ఐ మొగిలి నాయక్ కుటుంబ సభ్యులతో పాటు, గిరిజన మహిళలు, పిల్లలు, తండా గిరిజనులు పాల్గొన్నారు.






