20 August, 2026 | 10:53 PM

చిట్యాలలో రిపోర్టర్‌పై దాడి కేసు.. నలుగురు నిందితుల అరెస్ట్

20-08-2026 09:47 PM

భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు

భూపాలపల్లి,(విజయక్రాంతి): చిట్యాలకు చెందిన ఆర్‌బీ  న్యూస్ రిపోర్టర్ చిరు అలియాస్ రవీందర్‌ ఇంట్లోకి చొరబడి దాడి చేసి, ఇంటి సామాగ్రి ధ్వంసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కైలాపూర్ గ్రామ శివారులో నిందితులను అదుపులోకి తీసుకుని, దాడికి ఉపయోగించిన ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు వెల్లడించారు. అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి పరకాల జైలుకు తరలించారు.

ఘటన పూర్వాపరాలను డీఎస్పీ ఏ. సంపత్ రావు వెల్లడించారు. చింతకుంటరామయ్యపల్లి గ్రామానికి చెందిన బొజ్జం వేణుకు, అబ్బెంగుల రాజయ్యకు మధ్య నవాబుపేట శివారులోని భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై రిపోర్టర్ రవీందర్ కథనాలు ప్రసారం చేస్తూ, సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం చేస్తున్నాడనే కక్షతో వేణు అతనిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 17న భూపాలపల్లిలోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన ఒక వెంచర్ ప్రారంభోత్సవం అనంతరం, బొజ్జం వేణు తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకొని రిపోర్టర్‌పై దాడి చేసేందుకు పథకం వేశాడు.

అదే రోజు రాత్రి వేణు తన మేనమామ మెంగని నటరాజ్‌ను కలుపుకుని, మరో రెండు కార్లలో మొత్తం ఎనిమిది మంది నిందితులతో కలిసి చిట్యాలలోని రవీందర్ ఇంటికి చేరుకున్నారు. రవీందర్ తలుపు తీయగానే ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కొట్టి, గొంతు నులిమి, తలను గోడకేసి కొట్టడంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. అడ్డుకోబోయిన అతని భార్యను బెదిరించి, ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ మరి కొన్ని వస్తువులు ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:

చిట్యాల మండలంచింతకుంటరామయ్యపల్లి, (ప్రధాన నిందితుడు) మెంగని నటరాజ్  చింతకుంటరామయ్యపల్లి, చిట్యాల మండలం మొక్కిరాల ప్రణయ్  రియల్ ఎస్టేట్ వ్యాపారి, కొత్తగట్టు, శంకరపట్నం మండలం, కరీంనగర్ జిల్లా గోలి అఖిల్ కాంట్రాక్టర్, ఎల్కతుర్తి, హన్మకొండ జిల్లా స్వాధీనం చేసుకున్న వస్తువులు నేరానికి ఉపయోగించిన తెలుపు రంగు మారుతి స్విఫ్ట్ కారు (నెం. TS-16-FH-9089)

దాడి అనంతరం పరారీలో ఉంటూ వివిధ ప్రాంతాల్లో తప్పించుకు తిరుగుతున్న ఈ నిందితులను చిట్యాల ఎస్సై సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని పరకాల జైలుకు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితులైన మధువంశి, మహేష్, రాజేష్, ప్రశాంత్, ఆరిఫ్‌ల కోసం దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భౌతిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో చిట్యాల సీఐ డి. మల్లేష్, చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.