చేగుంట-మెదక్ మార్గంలో రాకపోకల దారిమళ్లింపు: డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, చేగుంట మండలం, చేగుంట గాంధీ చౌక్ నుండి మెదక్ వెళ్లే రహదారిలోని రైల్వే లెవల్ క్రాసింగ్ (LC No.228T) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానున్నందున ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) అంబదాస్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎల్సీ గేట్ వద్ద ఉన్న సీసీ రోడ్ నుండి పాత జాతీయ రహదారి (ప్రస్తుత ఆర్‌యూబీ), బస్టాప్ ఎదురుగా గల వెంచర్ మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు. కార్లు, బస్సులు, డీసీఎం వంటి వాహనాలు నార్సింగి నుండి మీర్జాపల్లి మీదుగా శంకరంపేట (ఆర్) డబుల్ రోడ్డు ద్వారా ప్రయాణించాలని, భారీ వాహనాలు, లారీలు రామాయంపేట లేదా నర్సాపూర్ మార్గాల ద్వారా వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే మాసాయిపేట నుండి మెదక్ వెళ్లే వాహనాలు ధర్పల్లి మీదుగా శంకరంపేట (ఆర్) రోడ్డు ద్వారా, తూప్రాన్ నుండి మెదక్ వెళ్లే వాహనాలు వెల్దుర్తి - ఉప్పులింగాపూర్ - గవ్వలపల్లి మీదుగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని డీఆర్వో కోరారు.






