కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): విద్యా ప్రమాణాల పెంపులో రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలిచిన పెద్దపల్లి జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ విజయంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రత్యేకంగా కలిశారు.
జిల్లాకు ఈ గౌరవం దక్కేలా కృషి చేసినందుకు ఆయన కలెక్టర్‌ను అభినందిస్తూ, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ విద్యా రంగంలో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం, మౌలిక వసతుల కల్పనలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.






