23 May, 2026 | 2:37 AM

డంపింగ్ యార్డ్‌పై సీఎంకు వివరిస్తాం

23-05-2026 01:27 AM
  1. సమస్య పరిష్కారానికి కృషి
  2. పదివేల మెట్రిక్ టన్నుల చెత్తడంప్ విడ్డూరం
  3. ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కమిషనర్

జవహర్‌నగర్, మే 22 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలు స్పష్టం చేశారు.

ఈ డంపింగ్ యార్డు వల్ల జవహర్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాలైన కీసర, నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ డివిజన్‌లలో లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా తెలుసుకున్నామని, అలాగే డంపింగ్ యార్డ్‌ను నిర్వహిస్తున్న రాంకీ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గతంలో ఈ సమస్యపై జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి సీఎంకు కూడా వివరించామన్నారు. దీంతో స్పందించిన సీఎం ప్రజాప్రతినిధులు, ప్రజల సమక్షంలో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలతో కూడిన నివేదికను ఇవ్వాలని ఆదేశించారన్నారు. 

ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇంతపెద్ద ఎత్తున చెత్తవేయడం ఎక్కడా లేదన్నారు. భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయని, ప్రజారోగ్యం గాలిలో కలిసిందని, పశుసంపద నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్థ అన్ని రకాలుగా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. 

ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ఒక దగా, ఒక మోసం అన్నారు. రాంకీ సంస్థ నరరూప రాక్షసుల లాంటిందన్నారు. ఈ సంస్థ ఏకఛత్రాధిపత్యంతో ప్రజల ప్రాణాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రూ.500 కోట్లతో విద్యుత్ తయారీ ప్లాంట్ ఏర్పాటు, రూ.250 కోట్లతో లిచెడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, రూ. 154 కోట్లతో దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టానన్నారు. కానీ గత మూడేళ్ల నుంచి పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. 

జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ..డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు పశువుల కంటే హీనంగా బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పశువులు, ప్రజల ప్రాణాలను రక్షించాలని సీఎంకు వివరిస్తానని చెప్పారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించామన్నారు. రాంకీ సంస్థ పనులను సీఎంకు సమగ్ర నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, కీసర డీసీ వసంత, జేఏసీ నాయకులు, మాజీ మేయర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.