కులగణన నిర్ణయం సమంజసమే
తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, మే 22 (విజయక్రాంతి): జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమేనని తెలంగాణ న్యాయ వాదుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యులు పులిగారి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో కులగణన అవసరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కవాడిగూడలోని జేఏసీ కార్యాలయంలో గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కులాల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు అందించడానికి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కులగణన జరగాల్సిందేనని ఆయన పేర్కొ న్నారు. కులగణన ద్వారా కులాల నిష్పత్తి తెలుస్తుందని ఆయన వివరించారు. దేశంలో కులం, మతం ఉన్నన్ని రోజులు కులరహిత సమాజ నిర్మాణం వల్లనే దేశ అభివృద్ది జరుగుతుందనేది ఓ నినాదం మాత్రమేనని, అందుకే రాజ్యాంగంలో ప్రాదేశిక సుత్రాలను ప్రవేశపెట్టారన్నారు. కులగణన సహేతుకమైందని దీంతో కులాల మధ్య వైశామ్యాలు తొలిగి శాంతియుత జీవనానికి తోడ్పడుతుందని పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు.






