ప్రభుత్వ సేవలను గిరిజనులకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి
ఐటీడీఏ పీవో మంద మకరందు
ఉట్నూర్, మే 18 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సోమవారం ఐటిడిఏ కార్యాలయంలో మే 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న జన్ జాతీయ గరిమ ఉత్సవ్ కార్యక్రమాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయ ఛాంబర్లో జ్యోతి ప్రజ్వలన చేసి, గిరిజన వీరుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడం, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని తక్షణ పరిష్కారం అందించడం ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మే 18 నుండి 25 వరకు నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులలో కుల ధృవీకరణ పత్రాలు (కాస్ట్ సర్టిఫికేట్లు), ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆధార్ కార్డులు, హెల్త్ సర్టిఫికేట్లు తదితర సేవలకు దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్, డాక్టర్ మనోహర్, ఇన్చార్జి సబ్ కలెక్టర్ గంగాధర్, ఐటిడిఏ పరిపాలన అధికారి దామోదర స్వామి, ఈఈ తానాజీ జాదవ్, ఏపీఓ (పివిటిజి) ఆత్రం భాస్కర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.






