బోనమెత్తిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): ఆషాడమాసం సందర్భంగా కరీంనగర్ నగరంలోని మార్కండేయనగర్, రాంనగర్ ప్రాంతాలలో పోచమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్కండేయనగర్ పద్మశాలి సంఘం, రాంనగర్ మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ రావు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనమెత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఉత్సాహంగా సాగిన ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోచమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ గాజ రామ-శివరాం, 13వ డివిజన్ కార్పొరేటర్ తేల్ల లక్ష్మి-రమేష్, పద్మశాలి మరియు మున్నూరు కాపు సంఘాల పెద్దలు, స్థానిక ప్రజలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






