రికార్డు స్థాయిలో ముగిసిన 'ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్‌పో 2026'
హైదరాబాద్ , జూలై 26 ః
మెస్సే ముంచెన్ ఇండియా మరియు ఇండియన్ ఫార్మా మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఎంఏ) సంయుక్తంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన 'ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్‌పో 2026' విజయవంతంగా ముగిసింది. నూతన సాంకేతికతల ప్రదర్శన, ఉత్పత్తుల ఆవిష్కరణలు, వ్యాపార సమావేశాలు మరియు పరిశ్రమకు సంబంధించిన నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్‌తో సాగిన ఈ ఎక్స్‌పో, మునుపటి ఎడిషన్‌ల కంటే అతిపెద్దదిగా నిలిచి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. హైటెక్స్‌లోని మొత్తం ఏడు హాళ్లలో 35,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ఈ ఎక్స్‌పోలో 353 ఎగ్జిబిటింగ్ బ్రాండ్‌లు పాల్గొనగా, 19,206 మంది సందర్శకులు విచ్చేశారు.
భారీ వృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యం గత ఎడిషన్‌తో పోలిస్తే ఎగ్జిబిషన్ స్థలం 30 శాతం పెరగ్గా, సందర్శకుల సంఖ్యలో 100 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, అమెరికా, యూకే, యూఏఈ సహా 30కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఒకే వేదికపై సాంకేతికతలను మదింపు చేయడానికి, నిర్ణయాధికారులతో సమావేశమవడానికి, వ్యాపార చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ వేదిక విశేషంగా ఉపయోగపడింది. మెస్సే ముంచెన్ ఇండియా సీఈఓ భూపిందర్ సింగ్ మాట్లాడుతూ.. "పాల్గొన్న వారి సంఖ్య, వ్యాపార చర్చల నాణ్యత మరియు దేశవిదేశీ కొనుగోలుదారుల రాక ఈ ప్లాట్‌ఫారమ్ స్థాయిని మరింత పెంచాయి. రాబోయే సంవత్సరాల్లో ఫార్మా పరిశ్రమ క్యాలెండర్‌లో ఇదొక ముఖ్యమైన వేదికగా స్థిరపడుతుంది" అని పేర్కొన్నారు.
ఈ ఎక్స్‌పోలో ఫార్మాస్యూటికల్ ప్రాసెసింగ్ మెషినరీ, ప్యాకేజింగ్ సిస్టమ్స్, ఆటోమేషన్, క్వాలిటీ-కంట్రోల్, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు డిజిటల్ టెక్నాలజీలను ప్రదర్శించారు. 120కి పైగా కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలు ఇక్కడ లాంచ్ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ మరియు డిజిటల్ సొల్యూషన్ ప్రొవైడర్ల భాగస్వామ్యం ఆధునిక ఫార్మా తయారీలో డేటా ఇంటిగ్రేషన్ మరియు డిజిటల్ క్వాలిటీ సిస్టమ్స్ వినియోగం పెరుగుతోందని స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక మరియు వియత్నాం వంటి దేశాల ప్రతినిధులతో సహా 350 మందికి పైగా హోస్టెడ్ కొనుగోలుదారులు ఈ ఎక్స్‌పోకు హాజరయ్యారు. 1,000కు పైగా బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లు జరిగాయి. ప్లాంట్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు మరియు ఎగుమతి అవకాశాలపై లోతైన చర్చలు జరిగాయి. సామర్థ్యం, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలలో ఫార్మా రంగం పెట్టుబడులు కొనసాగిస్తున్న తరుణంలో, భవిష్యత్ ఫార్మా తయారీ రూపురేఖలను మార్చే సాంకేతికతలు, సరఫరాదారులతో 'ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్‌పో' 2027లో తిరిగి రానుంది.






