26 July, 2026 | 7:10 PM

రెండు జిల్లాల మధ్య రవాణా అనుసంధానానికి మరో ముందడుగు

26-07-2026 06:13 PM

ఎనగల్ గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ ఆర్టీసీ బస్ డిపో నుంచి ఎనగల్ , బండపల్లి మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు నూతన బస్ సర్వీసును రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసుతో రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల మధ్య రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు కరీంనగర్‌కు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విప్  మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేములవాడ నుంచి వివిధ ప్రాంతాలకు దశలవారీగా కొత్త బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నామని చెప్పారు.

సుమారు 20 సంవత్సరాల తర్వాత ఈ మార్గంలో మళ్లీ బస్సు సర్వీసు ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని, ఇది స్థానిక ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లు  పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీకి 20 కొత్త బస్సులు అందించామని, వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను విస్తరిస్తున్నామని వివరించారు. ఇటీవలే చందుర్తి మండలం కొత్తపేట గ్రామానికి, అలాగే పలు దేవాలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.

ఎనగల్ గ్రామంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ఎనగల్‌లో హై లెవల్ బ్రిడ్జి, మామిడిపల్లి గ్రామం, అక్కడి దేవాలయానికి రహదారి సౌకర్యం కూడా త్వరలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలవాలని విప్ పిలుపునిచ్చారు..