9 July, 2026 | 1:23 AM

మేము కూడా సినిమా తీసినామురో..

09-07-2026 12:32 AM

కొత్త దర్శకుడు అజర్ 100 మంది నూతన నటీనటులతో స్థానికంగా రూపొందించిన తాజాచిత్రం ‘కొత్త సినిమా’. సురేశ్, రాకేశ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తోపాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీశ్ యాదవ్ నిర్మాతలు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ‘మేము కూడా సినిమా తీసినామురో..’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను బుధవారం లాంఛ్ చేశారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుక లో నటుడు సురేశ్ మాట్లాడుతూ.. “మాది గోదావరిఖని దగ్గర మార్కండేయ కాలనీ. నేనొక కిరణా షాప్ నడుపుకుంటూ ఉంటా. వెనక నిలబడే చిన్న పాత్ర దక్కితే చాలు అనుకొని, ఆడిషన్స్‌కు వెళ్లా. కానీ అజర్, నాకు లీడ్ రోల్ ఇచ్చారు.. నటనలో శిక్షణ ఇప్పించారు. కొత్త వాళ్లందరం చేసిన మా సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.

నటుడు రాకేశ్ మాట్లాడుతూ.. “మాది రామగుం డం. నేను సింగరేణి ఎంప్లాయ్‌ని. మధ్యతరగతి కుటుంబం.. హైదరా బాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వీలు దొరకలేదు. మా ఊరిలో జరిగిన ఆడిషన్స్‌లో మెయిన్ లీడ్‌కు నన్ను సెలెక్ట్ చేశారు. మా ఊర్లో ఉంటూ మా అమ్మ చేతి భోజనం తిం టూ సినిమా అవకాశం దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా” అన్నారు. డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ.. “కింద స్థాయి నుంచి వచ్చామని చాలా మంది చెప్తుంటారు.

మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. చీకటిలో వెలికితీసే బొగ్గు నుంచి వెలుగు పంచే ప్రాంతం రామగుండం నుంచి వచ్చిన వాళ్లం. ఎందరో గొప్ప దర్శకులు సినిమాను మన దగ్గరకు చేర్చారు, స్ఫూర్తి నింపారు. నేను ఈ సినిమాను మరింత దగ్గరగా తీసుకెళ్లాలనుకున్నా. ఊరిలోనే ఉంటూ ఊరివాళ్లతో సినిమా తీయొచ్చని నిరూపించా” అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘టైటిల్‌కు తగినట్లే మా సినిమా నిజంగా కొత్తగా ఉంటుంది.

అజర్ కలకు సహకరించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సరికొత్త కంటెంట్‌తో లోకల్ టాలెంట్ అజర్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. కొత్త సినిమాకు అందరి ప్రోత్సాహం ఉండాలి” అన్నారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. “హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదన ఈ పాటలో ఉంటుం ది” అని తెలిపారు.