9 July, 2026 | 1:22 AM

మా కంటెంట్ మాట్లాడుతుంది

09-07-2026 12:34 AM

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ హైదరాబాద్‌లో బుధవారం రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. “నందు ఈ కథను అద్భుతంగా రాశారు. ‘లెనిన్’ కథలో ఉండే పెయిన్ ను అఖిల్ తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు. మేం ఓటీటీల కోసం ఈ చిత్రాన్ని చేయలేదు. అందుకే మేం సంతృప్తి అయ్యే వరకు ఆగాం. ప్రేమతో, ఇష్టంతో చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు కూడా అదే ప్రేమను తిరిగిస్తారని ఆశిస్తున్నా. జూలై 10న వస్తున్నాం.. కొడుతున్నాం.. మనోడు కొడుతున్నాడు’ అన్నారు.

హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకుల మూలాలకు దగ్గరగా ఉండేలా ఈ కథ ఉంటుంది. మేం నిజాయితీగా కష్టపడ్డాం” అని చెప్పారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “ఈ సినిమాలోని భారతి పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది. ఇలాంటి ఓ గొప్ప పాత్రను నాకు ఇచ్చిన నందుకు థాంక్స్. నాలోనూ భారతి ఉందని నాకు అనిపిస్తుంటుంది. ఎవరికి ఏ పాత్ర దక్కాలన్నది ముందే రాసి ఉంటుంది” అన్నారు.

దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. “ఏం కావాలన్నా మేం చేస్తామని మాటిచ్చారు. అది అక్కినేని కుటుంబం మంచితనం. నాగార్జున ఇన్‌పుట్స్ ఎన్నో వాడుకున్నా’ అన్నారు. ‘మంచి చిత్రం చేశామని గర్వంగా చెప్పగలన’ని నిర్మాత నాగవంశీ తెలిపారు. సంగీత దర్శకుడు తమన్, చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మీడియాతో మాట్లాడాలంటే భయమేస్తోంది: నాగార్జున

ఈ ప్రెస్‌మీట్‌కు హాజరైన మీడియా మిత్రులందరినీ చూస్తూ,  నాగార్జున తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్, ప్రెస్‌మీట్స్ అంటే ఒక ఆరుగురు జర్నలిస్టులు, ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ ఉండేవారు. ఇప్పటిలాగా చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, నిరంతరం రికార్డ్ చేసే కెమెరాలు, డిజిటల్ రికార్డింగ్స్ ఏమీ ఉండేవి కావు.

రేపు సినిమా రిలీజ్ అవుతుందనగా ఆ ఆరుగురు వ్యక్తులే వచ్చి ఎంతో స్నేహపూర్వకంగా ప్రశ్నలు అడిగేవారు. ఆ రోజుల్లో మీడియా ముందు మాట్లాడటానికి ఎలాంటి భయం కూడా ఉండేది కాదు ఇప్పుడు మీడియా ముందు నిలబడి మాట్లాడాలంటేనే మనసులో ఒక రకమైన భయం వేస్తోంది.

ఎక్కడ ఏ కెమెరా పెడతారో, ఎవరు ఎలాంటి ప్రశ్న అడుగుతారో, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారో తెలియని గందరగోళం ఉంటోంది. ఈ విపరీతమైన కెమెరాల నిఘా, ఒత్తిడి వల్లే ప్రస్తుతం సెలబ్రిటీలందరూ మీడియా ముందు అంత ఫ్రీగా ఉండలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోయి కనిపిస్తున్నారు” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు.