ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు, అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం
- 87.53 కోట్ల నిధులతో నిర్మించిన కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రులు
- వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్న ప్రాజెక్ట్
- ప్రాజెక్ట్‌కు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ పేరు పెట్టేందుకు చర్యలు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- యువత మాదకద్రవ్యాల వైపు మళ్ల కుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి : రాష్ట్ర అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వనపర్తి, ఆగస్టు 24 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇంకా అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి జిల్లాలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సహచర అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు. రూ.87.53 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు రూ.36 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు కర్నే తాండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి జిల్లాలో 3384 ఎకరాలకు, నాగర్ కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలు కలిపి మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు.
ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పేరును గిరిజనుల ఇష్టదైవం అయిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఇదే కాకుండా పాలమూరు ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి జూపల్లి
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చాం: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
గత ప్రభుత్వ హయాంలో కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.87 కోట్లతో జీఓ తీసుకువచ్చినప్పటికీ, సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేసి పనులను మధ్యలోనే నిలిపివేశారని, మిగిలిన 40 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేసి పూర్తి చేస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పెండింగ్లో ఉన్న పనులను సుమారు రూ.29 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందని మిగిలిన 11 కోట్లు భూసేకరణ, ఇతరత్రా పెండింగ్ పనులకు ఖర్చు చేసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.2,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మార్కండేయ ప్రాజెక్ట్తో పాటు కర్నె తండా వంటి సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేసుకున్నామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తి చేయడంపై దృష్టి సారించిందన్నారు.కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు సంత్ సేవాలాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని,
ఇందుకు సంబంధించిన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం వనపర్తి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ తో కలిసి సర్జ్ పూల్ వద్ద ప్రారంభమైన నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.






