25 August, 2026 | 3:41 AM

వన మహోత్సవ లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలి

25-08-2026 02:02 AM
  1. నేడు జిల్లావ్యాప్తంగా భారీగా సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలి
  2. మొక్కల సంరక్షణ, మనుగడపై ప్రత్యేక దృష్టి సారించాలి
  3. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

మెదక్, ఆగస్టు 24(విజయ క్రాంతి) : వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు నిర్దేశించిన మొక్కల నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఎఫ్‌ఓ జోజి తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. మంగళవారం వన మహోత్సవంలో భాగంగా అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఇటీవల కురుస్తున్న వర్షాలు, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అనుకూల వాతావరణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ప్రతి మండలం, గ్రామం, పట్టణ ప్రాంతానికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి తెలిపారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని, మొక్కల మనుగడను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు.

నాణ్యమైన మొక్కలను మాత్రమే నాటాలని, అవసరమైన మొక్కలను సకాలంలో తరలించాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మొక్కలు నాటాలని, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్రీని ప్రోత్సహించాలని అన్నారు. దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించాలని, వన మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి మీడియాను కూడా భాగస్వామ్యం చేయాలని మంత్రి ఆదేశించారు.

 మెదక్ జిల్లాలో 60శాతం లక్ష్యం పూర్తి.. 

 కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో వన మహోత్సవం కింద  31 లక్షల 95  మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు .19 లక్షల 43వేల 654 మొక్కలు నాటి .60.83 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మంత్రి సూచనల మేరకు రేపు జిల్లావ్యాప్తంగా భారీ స్థాయిలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేసి, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో  కాన్ఫరెన్స్లో డి ఎఫ్‌ఓ జో జి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.