25 August, 2026 | 3:39 AM

ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

25-08-2026 12:42 AM
  1. ధరణి సమస్యలకు ‘భూ భారతి’తో శాశ్వత పరిష్కారం
  2. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ రీ-సర్వే
  3. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  4. ఆది వరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి

మంథని/కమాన్‌పూర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధిని రెం డు కళ్లుగా భావించి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో రూ.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు.

ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ‘భూ భారతి’ వ్యవస్థను తీసుకువస్తోందని చెప్పారు. పారదర్శక సేవలు అందించేందుకు భూ రీ-సర్వేను దశలవారీగా చేపడుతున్నామని, మొదటి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కమాన్ పూర్ పర్యటన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన ఆది వరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఆర్డీవో సురేష్, తహసీల్దార్ వాసంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

గంగాపురి 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

మంథని పట్టణంలోని గంగాపురిలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో పెద్దపల్లి ఆపరేషన్ పర్యవేక్షక ఇంజనీర్ వి. గంగాధర్, మంథని ఆపరేషన్ డీఈ వి. ప్రభాకర్, పెద్దపల్లి యూజీసీబీ అండ్ కన్స్ట్రక్షన్ డీఈ కె. శ్రీనివాస్ రెడ్డి, కన్స్ట్రక్షన్ ఏడీఈ ఎం సత్యనారాయణ, మంథని కన్స్ట్రక్షన్ ఏఈఈ బి రాజ్, కరీంనగర్ సివిల్ ఈఈ కె శ్రీనివాస్, పెద్దపల్లి సివిల్ ఏడీఈ ఎ. జయ భారతి, ఆపరేషన్ ఏడీఈ వి. వెంకటనారాయణ, ఆపరేషన్ ఏఈ కె. సాయి తదితరులు పాల్గొన్నారు.